(Source: ECI/ABP News/ABP Majha)
Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి
మోకాలి నొప్పి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం. వారంలో కొన్నిరోజులు వ్యాయామాలు చేయడం వల్ల స్వయంగా మనమే మార్పును గమనించవచ్చు.
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత వల్ల మోకాలి నొప్పితో బాధపడుతున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఆ బాధ భరించలేక మోకాలికి శస్త్ర చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఏటా లక్షకు పైగా ప్రజలు మోకాలి మార్పిడి ఆపరేషన్‌లు చేయించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో నిరూపితమైంది. గతంలో 60 ఏళ్ల, 70 ఏళ్లు వచ్చాయంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో కేవలం 30 ఏళ్లు, 40 ఏళ్లకు కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మోకాలి నొప్పి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం. వారంలో కొన్నిరోజులు వ్యాయామాలు చేయడం వల్ల స్వయంగా మనమే మార్పును గమనించవచ్చు.
Also Read: Benefits of Dates: పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తినండి... ఎన్నో ప్రయోజనాలు
ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మృదులాస్థి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది. వృద్ధాప్యంలో మృదులాస్థి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలు భాగంలో నిర్ధిష్టమై ఈ సమస్య ఎక్కువవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి ప్రారంభదశలో మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినప్పుడు మోకాలు నొప్పి కలుగుతుంది. ఆ తరువాత క్రమేపి కీళ్ల వాపు, మోకాలు ఎర్రబడటం, బలహీనంగా తయారవడం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. మోకాలు నొప్పి ప్రారంభంలో రోగులు ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు చేస్తారు.
Also Read: Avoid Reheating: ఈ ఐదు పదార్థాలను వేడి చేసి అస్సలు తినకండి... అలా తింటే లాభాల కంటే నష్టమే ఎక్కువ
మోకాలి నొప్పిని తగ్గించే వ్యాయామం
సాధారణంగా మోకాలిని చాచే వ్యాయామం చేయడం ద్వారా మోకాలి చుట్టూ కండరాలు బలపడతాయి. అయితే మోకాలిని సరిగ్గా చాచకుంటే నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఈ వ్యాయామాన్ని ఎలాంటి సాధనం లేకుండా కేవలం కుర్చీని ఉపయోగించి చేయవచ్చు. ఈ వ్యాయామం వారానికి రెండు సార్లు చేయడం వల్ల మోకాలి బలం పెరిగి నొప్పి తగ్గే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మోకీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. వాటితో పాటు నొప్పిని పెంచే పనులు తగ్గించి, కీళ్లను బలపరిచే వ్యాయామాల సాధన చేయాలి. మోకాళ్ల సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు. ఏరోబిక్, జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి. అలాగే మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసింపట్టా వేసి కూర్చోకూడదు.
మోకాలి నొప్పుల నివారణకు శశంకాసన
దండాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులను తలపైకి నిటారుగా చాపాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ చేతులను నేలపై ముందుకు చాపాలి. నుదుటిని నేలపైన ఆనించాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులు, వీపును పైకి ఎత్తి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస వదులుతూ చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచి దండాసనంలో కూర్చొని సేద తీరాలి.
మోకాలి నొప్పుల నివారణకు ఇంటి చిట్కాలు
కావాల్సిన పదార్థాలు: అర టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతి గింజలు.
తయారుచేసే విధానం: ముందుగా మిక్సీలో మెంతి గింజలను, మిరియాలను, జీలకర్రను విడివిడిగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఈ పొడులన్నింటినీ జల్లెడ పట్టి, అన్ని పదార్ధాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ఏర్ టైట్(గాలి చొరబడని) కంటైనర్‌లోకి తీసుకుని నిల్వచేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా పొడిని వేసి కలపండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు. ఈ రసం తీసుకోవడం వల్ల మోకాలి నొప్పి తగ్గుతుంది, శరీరానికి బలం చేకూరుస్తుంది. 20 రోజుల నుంచి రెండు నెలల పాటు ఈ మిశ్రమాన్ని రోజూవారీ తీసుకోవడం మంచిది.