Avoid Reheating: ఈ ఐదు పదార్థాలను వేడి చేసి అస్సలు తినకండి... అలా తింటే లాభాల కంటే నష్టమే ఎక్కువ
ఫ్రిజ్‌లో పెట్టి బయటికి తీసి వేడి చేసుకుని తినడం అనే అలవాటు మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అలా చేయడం వల్ల అనారోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.
సమయంతో పరిగెడుతున్న ఈ రోజుల్లో ఏ పనైనా సులువుగా అవ్వాలనే చూసుకుంటాం. ఈ క్రమంలోనే తినే ఆహారం తయారు చేసుకోవడానికి కూడా ఈజీ మార్గాలు వెతుక్కుంటాం. అంతేకాదు, ఒకేసారి కాస్త ఎక్కువగా వండేసి... ఫ్రిజ్‌లో పెట్టుకుని కావల్సి వచ్చినప్పుడు దాన్ని వేడి చేసుకుని లాగించేస్తాం. కానీ, ఫ్రిజ్‌లో పెట్టి బయటికి తీసి వేడి చేసుకుని తినడం అనే అలవాటు మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అలా చేయడం వల్ల అనారోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఓ ఐదు పదార్థాలను మాత్రం ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసి వేడి చేసుకుని మాత్రం తీసుకోవద్దని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పదార్థాలు ఏంటో చూద్దాం.
గుడ్లు: ఎప్పుడైనా సరే గుడ్లను మాత్రం ఉడికిన తర్వాత ఎక్కువ సమయం పక్కన పెట్టి ఉంచకూడదు. ఉడికించిన తర్వాత కొద్ది సమయంలోనే తినెయ్యాలి. అలా కాకుండా ఉడికించి పక్కన పెట్టి ఎప్పుడో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేడి చేసుకుని తింటే మాత్రం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. గుడ్డు ఎందుకు తింటాం... అందులో ప్రొటీన్లు ఉంటాయనే కదా. గుడ్డును రీ హీట్ చేయడం వల్ల అందులో ఉండే ప్రొటీన్ నుంచి carcinogenic అనే క్యాన్సర్ కారకం వెలువడుతుందట. అందుకే గుడ్డును ఎప్పుడూ రీ హీట్ చేసి తినొద్దు.
రైస్: చాలా మంది ఇంట్లో మధ్యాహ్నం వండిన అన్నాన్ని రాత్రి పూట కూడా తింటారు. ఈ క్రమంలో రాత్రి తినే ముందు వేడి చేస్తారు. Food Standards Agency ప్రకారం చల్లబడిన అన్నాన్ని తిరిగి వేడి చేసి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందట.
బంగాళదుంపలు: బంగాళదుంపల్లో విటమిన్ B6, పొటాషియం, విటమిన్ C ఉంటుంది. బంగాళదుంపలను రీ హీట్ చేయడం వల్ల Clostridium Botulinum వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. బంగాళదుంపల్ని రీ హీట్ చేసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లైతే బాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని చేస్తుంది.
చికెన్: వారంతో పని లేకుండా చికెన్ తెచ్చుకుని వండుకుని లాగించేస్తుంటాం. మిగిలింది రేపు తిందాం అని ఫ్రిజ్‌లో తోసేస్తాం. కానీ, ఒకసారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌ని తిరిగి వేడి చేస్తే అందులో ఉండే ప్రొటీన్ మరో రూపం దాల్చుతుంది. చికెన్ వండిన తర్వాత కూడా ఒక్కోసారి అందులో బాక్టీరియా అలాగే ఉంటుంది. దీని వల్ల వండిన చికెన్‌ని మైక్రోవేవ్‌లో వేడి చేయడం ద్వారా ఆ బాక్టీరియా మొత్తం మాంసాన్ని చెడగొడుతుంది.
కూరగాయలు: ఏ రకం కూరగాయల్ని అయినా సరే కూర చేసిన తర్వాత వాటిని రీ హీట్ చేయకూడదు. మరీ, ముఖ్యంగా క్యారెట్. వండిన కూరగాయల్ని తిరిగి వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రేట్... nitrosamineగా మారుతుంది. దీని వల్ల పిల్లలు జీర్ణాశయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అందుకే ప్రతి రోజూ మీకు కావాల్సినంత మాత్రమే వండుకోండి. మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసుకుని తినకండి. ఒక వేళ మీరు ఏదైనా మిగిలిన వంటకాన్ని ఫ్రిజ్‌లో పెడితే... దాన్ని మీరు తినాలనుకునే గంట ముందు తీసి బయట పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ పదార్థాన్ని తిరిగి వేడి చేసుకోవల్సిన అవసరం ఉండదు.