Corona Virus: షాకింగ్ ఫలితం, ఆ వ్యాక్సిన్ పిల్లలపై తక్కువ ప్రభావం చూపిస్తోందట, వేసినా ఏం లాభం?
పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక వ్యాక్సిన్ అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదట.
కరోనా మహమ్మారి జోరు తగ్గినప్పటికీ మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. త్వరలో నాలుగోవేవ్ కూడా వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు పెద్దవాళ్లకే వేసిన కరోనా వ్యాక్సిన్లు ఇప్పుడు పిల్లలకు చేరాయి. 15 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు వేస్తున్నారు. కొన్నిదేశాల్లో అయిదేళ్ల వయసు దాటిన పిల్లలందరికీ టీకాలు వేయడం ప్రారంభించారు. అయితే వారికి వేస్తున్న టీకాల్లో ఫైజర్ వ్యాక్సిన్ వారిపై ఎక్కువకాలం పనిచేయడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనను న్యూయార్క్ స్టేట్ అధ్యయనకర్తలు నిర్వహించారు. ఇందులో ఫైజర్, బయోన్టెక్ అనే టీకాలు రెండు మోతాదులు అయిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు అమెరికాలో ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్లు విరుచుకుపడినప్పుడు ఈ టీకా పిల్లలకు రక్షణగా నిలిచాయి. చాలా సమర్థవంతంగా పనిచేశాయి. కానీ ఆ పిల్లల్లో వ్యాప్తిని నిరోధించే సామర్థ్యాన్ని మాత్రం చాలా త్వరగా కోల్పోయినట్టు గుర్తించారు. అంటే ఈ రెండు టీకాలు కేవలం తక్కువ కాలం పాటే పిల్లలకు రక్షణగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్నే అధ్యయనకర్తలు నిరూపించారు.
టీకా తీసుకున్న 5 నుంచి 11 ఏళ్ల పిల్లల్లో సంక్రమణ వ్యాప్తి డిసెంబర్ మధ్యనాటికి 68 శాతం ఉంది. జనవరి చివరి నాటికి ఆ శాతం 12కి దిగజారింది. కనీసం రెండు నెలలు కూడా ఆ టీకాలు సమర్థంగా పనిచేయలేకపోతున్నాయి. అలాగే 12 నుంచి 17 మధ్య వయసు వారికి ఇచ్చిన ఈ టీకా డిసెంబర్లో 66 శాతం రక్షణను కల్పించింది. అదే జనవరి చివరి నాటికి మాత్రం 51 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి ఆ టీకాలు ఎక్కువ కాలం పిల్లలకు రక్షణ కల్పిస్తాయని ఎలా నమ్మగలం?
ఈ అధ్యయనాన్ని ముందుకు నడిపించిన పరిశోధకులు మాట్లాడుతూ ‘ఈ అధ్యయన ఫలితం పిల్లలకు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ గురించి పరిశోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది’ అని తెలిపారు. అదే యుక్త వయస్కులపై ఈ టీకా ఆసుపత్రిలో చేరడానికి వ్యతిరేకంగా 73 శాతం, పిల్లలపై 48 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు డేటా ద్వారా తెలుస్తోంది.
మోతాదు పెంచాలా?
పిల్లలకిచ్చే టీకాల మోతాదు పెంచాల్సిన అవసరంపై కూడా చర్చించాలని అధ్యయనకర్తలు భావిస్తున్నారు. పెద్దలకు టీకా 30 మైక్రోగ్రామ్ డోస్‌ను వేస్తారు, అదే పిల్లలకైతే 10 మైక్రోగ్రామ్ డోస్ వేస్తారు. పిల్లలకు కూడా పెద్దలతో సమానంగా డోస్ వేయాల్సిన అవసరం ఉందనే వారు కూడా ఉన్నారు. అలాగే పిల్లలకు కూడా బూస్టర్ డోస్ అవసరం అంటున్నారు పరిశోధకులు.
Also read: శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తున్నారా? ఈ ఆరోగ్య జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే
Also read: హైబీపీని సహజంగా తగ్గించే ఆహారాలివి, తింటే ఎంతో మేలు