High BP: హైబీపీని సహజంగా తగ్గించే ఆహారాలివి, తింటే ఎంతో మేలు
ఎక్కువ శాతం మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య అధిక రక్తపోటు.
ప్రపంచంలో హైబీపీ చాలా సాధారణ సమస్య అయిపోయింది. దాదాపు సగం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండె పోటు వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే హైబీపీని తక్కువ అంచనా వేయకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్సతో పాటూ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. బీపీని అదుపులో ఉండే ఆహారపదార్థాలను మెనూలో చేర్చుకోవాలి. ఆ ఆహార జాబితా ఇదిగో...
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు
వీటిలో యాంథోసైనిన్లు అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 34,000 మందిపై చేసిన అధ్యయనంలో ఈ బెర్రీ జాతి పండ్లు తినడం వల్ల 8 శాతం మందిలో బీపీ అదుపులోకి వచ్చినట్టు తేలింది. తినని వారిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.
అరటిపండ్లు
వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుది. ఒక మీడియం సైజు అరటిపండులో 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా హైబీపీ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.
బీట్ రూట్
హైబీపీ బాధపడే వాళ్లు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే మంచిది. 2015లో చేసిన ఒక అధ్యయనంలో ఎవరైతే నాలుగు వారాల పాటూ రోజుకు ఒక కప్పు బీట్ జ్యూస్ తాగారో వారిలో హైబీపీ నియంత్రణలోకి వచ్చింది.
డార్క్ చాక్లెట్
డబ్బైశాతం కోకో ఉన్న చాక్లట్ ముక్కను రోజూ తినడం ద్వారా హైబీపీని తగ్గించుకోవచ్చు. ప్రీ హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ ఉన్నవారిలో ఈ చాక్లెట్ బాగా పనిచేస్తుంది.
కివీ పండ్లు
రోజుకో కివీ పండు తింటే హైబీపీ తగ్గుతుందని ఒక పరిశోధన తెలిపింది. రోజుకు మూడు కివీలు ఎనిమిది వారాల పాటూ తింటే సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటులో తగ్గుదల కనిపిస్తుంది. అలాగే రోజుకో యాపిల్ తిన్నా ఇదే ఫలితం కలుగుతుంది.
ఓట్స్
ఓట్స్ లో బీటా గ్లూకెన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. ఉదయానే అల్పాహారంగా ఓట్ మీల్ తింటే చాలా మంచిది.
ఆకుపచ్చని కూరగాయలు
వీటిలో నైటేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ముందుంటాయి. క్యాబేజ్, కాలే,చ లెట్యూస్, పాలకూర లాంటివి అధికంగా తింటాయి.
వెల్లుల్లి
ఇది సహజంగానే యాంటీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో ఉండే అలిసిన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
పుచ్చకాయ, దానిమ్మ, దాల్చినచెక్క, పిస్తా, పప్పులు... వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: బంగాళాదుంపల తొక్కల్లో బోలెడన్నీ పోషకాలు, పొట్టుతో తింటే ఆయుర్ధాయం