Snoring: గురక ఇబ్బంది పెడుతోందా? రాకుండా ఇలా అడ్డుకోండి
యూనివర్సల్ సమస్యగా మారిపోయింది గురక. దాన్ని అరికట్టేందుకు చిన్న చిట్కాలు ఇవిగో
గురకతో ఇబ్బంది పడేవాళ్లు ఎంతోమంది. దీనికి కనీసం మందులు కూడా సరిగా లేవు. అలాగని వదిలేస్తే గురకపెట్టేవాళ్లకే కాదు, పక్కన పడుకున్న వాళ్లకీ ఇబ్బందే. అందుకే గురకను కొన్ని పద్ధతుల ద్వారా రాకుండా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు మీరు కొన్ని చిట్కాలు పాటించాలి.
అసలెందుకు వస్తుంది గురక?
గురక రావడానికి చాలా కారణాలు ఉంటాయి. గాలి పీల్చినప్పుడు శ్వాస నాళాల్లో ఏదైనా అడ్డంకులు కలిగినా గురక వస్తుంది. శ్వాసతీసుకోవడం, వదలడం చేసినప్పుడు ఆ గాలి ప్రయాణానికి అడ్డంకులు తగిలినా గురక లాంటి శబ్ధం వినిపిస్తుంది. మెడ, తలలో ఉన్న మృదు కణజాలంలో కంపనాల వల్ల కూడా గురక కలుగుతుంది. ఈ కణాజాలాలు నోటిపైభాగంలో ఉన్నాయి. అక్కడ ఉండే వాయుమార్గం నిద్రలో భాగంగా మూసుకుపోయి ఉన్నప్పుడు గాలి బలవంతంగా లోపలికి చొరబడుతుంది. ఆ సమయంలో ఏర్పడే కంపనాలు గురకగా మనకు వినిపిస్తాయి.
గురక రాకుండా ఇలా అడ్డుకోవచ్చు..
గురక రాకుండా ఉండాలంటే నిద్రపోయినప్పుడు కూడా వాయుమార్గం గుండా గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణం చేయాలి. అలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
1. ఎంతో మంది రాత్రి పూట మద్యం తాగే అలవాటు ఉంది. ఇలా మద్యం తాగేవారిలో గురక సమస్య చాలా అధికం. మద్యం తాగి నిదరపోయాక శ్వాసనాళాలు సంకోచిస్తాయి. మద్యం వల్ల దీర్ఘనిద్రలో ఉన్నప్పుడు గాలి శ్వాసనాళాల గుండా సరిగా ప్రయాణించలేక గురక శబ్ధం వస్తుంది. అందుకే రాత్రిపూట మద్యం తాగడం మానేయాలి.
2.గురకను అడ్డుకునేందుకు చిన్న క్లిప్స్‌లాంటివి వచ్చాయి. నిద్రపోయే ముందు ఈ క్లిప్స్ ను ముక్కుకు పెట్టుకుంటే లోపల శ్వాసనాళాలు మూసుకుపోకుండా తెరిచి ఉండేలా చూస్తాయి. కొందరిలో ఈ క్లిప్స్ బాగానే పనిచేస్తున్నాయి. కొందరికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. కాబట్టి ఇవి కచ్చితంవగా పనిచేస్తాయని మాత్రం చెప్పలేము.
3. వెల్లకిలా పడుకోవడం వల్ల గురక వచ్చే అవకాశం పెరుగుతుంది. వెల్లకిలా నిద్రపోయినప్పుడు నాలుక, గడ్డం, కొవ్వు కణజాలం అన్నీ గాలి వెళ్లే శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. అందుకే వెల్లకిలా పడుకోకూడదు, పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గే అవకాశం ఉంది.
4.ముక్కు దిబ్బడ కట్టినప్పుడు గురక అధికంగా వస్తుంది. అందుకే ముక్కు దిబ్బడను వదిలించే నాసిల్ డ్రాప్స్ వేసుకుని పడుకోవాలి. ముక్కులోంచి గాలి సరిగా ఆడకపోయినా గురక సమస్య అధికమవుతుంది.
5. బరువు అధికంగా పెరిగే వారిలో గురక ఎక్కువగా వస్తుంది. వాయునాళాలకు కొవ్వుకణజాలం అడ్డుపడి ఇలా జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గి, మీ ఎత్తుకు తగ్గ బరువును పొందాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: బంగాళాదుంపల తొక్కల్లో బోలెడన్నీ పోషకాలు, పొట్టుతో తింటే ఆయుర్ధాయం
Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు