Waterfalls: జలకళతో ఎత్తిపోతల పరవళ్లు- చూసేందుకు క్యూ కట్టిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు
వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా.
ఎత్తైన కొండలు.. దట్టమైన అడవులు.. పాల నురగల జలపాతాలు.. ఆహా ఎంత బాగుందో కదా ఆ ఊహ. వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఇట్టే ఆ జలపాతాల అందాలతో ప్రేమలో పడిపోతారు. అటువంటి జలపాతాలు ప్రకృతి ప్రేమికుల్ని మరెంతగానో కట్టిపడేస్తాయి. ఆ అందాలు ఇప్పుడు ఎక్కడో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయి.
ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతం వరద నీటితో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం పడటంతో ఎత్తిపోతలకు వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద వచ్చి చేరుతుంది. దీంతో 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది.
ఎత్తిపోతల వద్ద పర్యాటకుల సందడి......
ఎత్తిపోతల జలపాతం నయాగరా అందాలను తలపిస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎత్తిపోతలకు తరలి వస్తున్నారు. కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఈ ఎత్తిపోతల ఉంది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగుల ఎత్తు నుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం కూడా ఉంది.
పల్నాడులోని ఎత్తిపోతలను సందర్శించడానికి ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సుధీర్ఘంగా పొడవు, ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న నీటి ప్రవాహం, చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుండి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తిపోతలను చూసి సంబరపడిపోతున్నారు.
ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జలపాతం వద్ద మడుగులు చాలా లోతుగా ఉండి నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం.
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంతగా కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. గతంలో వర్షాలు లేక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సైతం నీరు కరువైంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడేవారు. భూగర్భ జలాలు పడిపో వడంతో పంటలను పండించేందుకు నానా తంటాలు పడేవారు. కానీ ప్రస్తుతం ఆశించిన స్థాయి లో వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.