Thalapathy Vijay: స్పీడ్ పెంచిన దళపతి - విద్యారంగంపై విజయ్ ఫోకస్, 234 నియోజకవర్గాల్లో ఆ సంస్థల ఏర్పాటు
దళపతి విజయ్ స్పీడ్ పెంచారు. ఇటీవల సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న విజయ్ ఇప్పుడు తమిళనాడులో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Thalapathy Vijay: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాట వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఆయన ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. అయితే ఇటీవల విజయ్ చేస్తున్న పనులు, ప్రసంగాలు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా విజయ్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ ద్వారా విజయ్ ఓ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడనే వార్త ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
234 నియోజకవర్గాల్లో దళపతి విజయ్ ఇన్స్టిట్యూట్..
దళపతి విజయ్ మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యా సాయం అందించే దిశగా దళపతి విజయ్ ఇన్స్టిట్యూట్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంస్థ విద్యార్థులకు ఉచిత ట్యూషన్, స్టడీ మెటీరియల్స్, ఇతర సౌకర్యాలను అందించనున్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు లబ్ది పొందనున్నారు. ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసి పొలిటికల్ ఎంట్రీకి ఒక బలమైన పునాదిని వేస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారట. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడుతున్నారనే పాజిటివ్ టాక్ తమిళనాట వినిపిస్తోందట.
విజయ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ ద్వారా ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే విజయ్ ఈ మధ్య కాలంలో నేరుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేరువవ్వడం ఆయన పొలిటికల్ ఎంట్రీకీ సూచనల్లా కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. గత నెలలో తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి 10, 12 తరగతుల బోర్డు పరీక్షలలో టాపర్‌లను ఎంపిక చేసి వారికి నగదు బహుమతులను అందించాడు విజయ్. తాజాగా ఇప్పుడు ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటు చేయడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట చర్చ జరుగుతోంది.
త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ?
దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. అయితే ఆయన ఇప్పటి వరకూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ మధ్య తన సన్నిహితులు, అభిమానులతో తన పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చించారనే వార్తలు బయటకు రావడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ కంఫర్మ్ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు వరుస సేవా కార్యక్రమాలతో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు బలపడుతున్నాయి. అన్నీ కుదిరితే ఆయన 2026 లో తన కొత్త పార్టీను ప్రకటిస్తారని, అలాగే ఎన్నికల్లో పోటీకు దిగుతారనే టాక్ నడుస్తోంది. ఒక వేళ విజయ్ నేరుగా పోటీ చేయకపోయినా తన అభిమానులను నిలబెట్టే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో కూడా ఆయన అభిమానులు పలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కూడా. అయితే విజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు ఎక్కువయ్యాయి. మరి విజయ్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది చూడాలి.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial