Padma Shri: 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ.. షావుకారు జానకి సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం..
ప్రముఖ నటి షావుకారు జానకిని పద్మశ్రీ పురస్కారం వరించింది.
ప్రముఖ నటి షావుకారు జానకిని పద్మశ్రీ పురస్కారం వరించింది. మంగళవారం నాడు కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు షావుకారు జానకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 18 ఏళ్ల వయసులో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ ఒకట్రెండు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 90 ఏళ్ల ఈ నటి ఇప్పటివరకు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 1931 డిసెంబర్ 11న రాజమండ్రిలో జన్మించారు జానకి.
సినిమాల్లోకి రాకముందే ఆమెకి వివాహం జరిగింది. 'షావుకారు' సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికి ఆమె సోదరి కృష్ణకుమారి కూడా నటిగా పరిచయమయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెని ప్రోత్సహించకపోయినా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన కెరీర్ ను నిలబెట్టుకున్నారు షావుకారు జానకి.
ఒకానొక దశలో ఆమె ఏడాది ఇరవైకి పైగా చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ ల సరసన కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి పాపులారిటీ దక్కించుకున్నారామె. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఆమె ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.
ఈ జెనరేషన్ లో బామ్మ క్యారెక్టర్లు కూడా పోషించారు. ఎన్టీఆర్, సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలో సమంత బామ్మగా నటించారు షావుకారు జానకి. సినిమా ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు 'పద్మశ్రీ' అవార్డుతో ఆమెని గౌరవించింది.
ఈ విషయంలో షావుకారు జానకి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తను ఆశించకుండానే.. న్యాయమైన రీతిలో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని.. దేశ గణతంత్ర వేడుకల సమయంలో ఈ అవార్డు ప్రకటించడం గర్వకారణంగా ఉందంటూ మీడియాతో చెప్పారామె. 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఆమె నటించిన చిత్రాల్లో తప్పక చూడాల్సిన సినిమాలు..
1. కన్యాశుల్కం
2.రోజులు మారాయి.
3.డాక్టర్ చక్రవర్తి
4.అక్కాచెల్లెళ్లు
5.పసుపు కుంకుమ
6.జయం మనదే
7.సొంత ఊరు
8.తాయారమ్మ బంగారయ్య
9.మజ్ను
10.సంసారం ఒక చదరంగం
Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..