Varisu Movie: కర్నాటకలో ‘వారిసు’కు ఎదురు దెబ్బ, కారణం రష్మికేనా?
కర్నాటకలో ‘వారిసు’కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలిరోజు 757 షోలు ప్రదర్శించగా, మరుసటి రోజు 466 షోలకు పడిపోయింది. దానికి కారణం నటి రష్మిక మందాన అనే టాక్ నడుస్తోంది.
గత కొంత కాలంగా కన్నడ సినిమా పరిశ్రమలో రష్మిక మందన్నపై నెగెటివ్ ప్రచారం కొనసాగుతోంది. కన్నడ ఇండస్ట్రీ పట్ల ఆమె వ్యవహరించే తీరే ఇందుకు కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కిరాక్ పార్టీ’ సినిమా విషయంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. అప్పటి నుంచి తనను కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. తాజాగా ఆమె నటించిన ‘వారిసు’ సినిమాకు కర్నాటకలో ఎదురు దెబ్బ తగిలింది.
కర్నాటకలో ‘వారిసు’కు ఎదురు దెబ్బ
దళపతి విజయ్, రష్మిక మందన్న నటించిన సినిమా ‘వారిసు’. జనవరి 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.2 కోట్ల రూపాయలను రాబట్టింది. భారత్ లో కేవలం రెండు రోజుల్లోనే రూ. 20 కోట్లు వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల బాగానే ఆడుతున్నా, కర్నాటకలో మాత్రం ఈ సినిమా పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ‘వారిసు’ విడుదలైన రెండవ రోజునే దాదాపు 300 షోలను కోల్పోయింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజు బెంగళూరులో 757 షోలు ఆడింది. మరుసటి రోజున 466 షోలకు పడిపోయింది.
షోల ఎత్తివేతకు కారణం ఆమేనా?
ఇక రాష్ట్రంలో షోల సంఖ్య తగ్గడానికి రష్మిక మందన్న కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘కిరాక్ పార్టీ’ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకపోవడంతో గత ఏడాది నుంచి వివాదం కొనసాగుతోంది. రష్మిక 2016లో రక్షిత్ శెట్టి సరసన ‘కిరాక్ పార్టీ’ సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని‘కాంతార’ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించారు. 2018లో బ్లాక్ బస్టర్ సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఇటీవలే ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ లో త్రోబాక్ పోస్ట్ ను షేర్ చేశారు. సినిమాలో భాగస్వామ్యం అయిన అందరికీ ఈ పోస్టు ట్యాగ్ చేశారు. ఒక్క రష్మికకు మాత్రం చేయలేదు. అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది. ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం ‘వారిసు’పై పడింది.
ఒకేరోజు విడుదలైన ‘వారిసు’, ‘తునివు’
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారిసు’ సినిమా, యాక్షన్-డ్రామాగా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, ఖుష్బు, ప్రభు, యోగి బాబు, సంగీత ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అటు ఇదే రోజున అజిత్ నటించిన ‘తునివు’ విడుదలైంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మంజు వారియర్, సముద్రఖని, పవన్ రెడ్డి ముఖ్యమైన పాత్రలు చేశారు.
View this post on Instagram
Read Also: సంపాదనలో దూసుకుపోతున్న షారుఖ్, ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల లిస్టులో చోటు