Nuvvunte Naa Jathaga Serial Today December 26th: నువ్వుంటే నా జతగా: ఒకే చోట పెళ్లిళ్లు ప్రీప్లానా! మిథున, దేవాలు ట్విస్ట్ ఇస్తారా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 26th మిథున, దేవాల పెళ్లి ఒకే గుడిలో ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ప్రమోదినితో మిథున చెప్పి మాటలు చెప్తాడు. మిథునే నిన్ను వద్దు అనేసిందా అని ప్రమోదిని షాక్ అయిపోతుంది. ఒకప్పుడు నీ కోసం అందరినీ వదిలేసుకున్న మిథున ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయావని చెప్పడం ఏంటి అని ప్రమోదిని అడిగితే అది నా తలరాత వదినా అని దేవా కన్నీరు పెట్టుకుంటాడు.
దేవా దగ్గరకు శారద, సత్యమూర్తి వచ్చి టైం అవుతుంది వెళ్దాం అని అంటుంది. ఇంతలో సూర్యకాంతం ప్రమోదినితో ఏంటక్కాయ్ చూస్తుంటే దేవాకి గీతోపదేశం చేస్తున్నట్లున్నావ్ అని అడుగుతుంది. గీతోపదేశం ఏంటి అని శారద అంటే ప్రమోదిని అక్క దేవాని ఫుల్లుగా బ్రెయిన్ వాష్ చేసినట్లు మిథునని వదులుకోవద్దు.. అని చెప్తున్నట్లు ఉంది.. నిజమే కదా అక్క అని కాంతం అడుగుతుంది. సత్యమూర్తి కొడుకు దగ్గరకు వెళ్లి నువ్వు భానుని పెళ్లి చేసుకుంటా అని తనకి మాటిచ్చావ్.. నేను కూడా మాటిచ్చా.. ఒక వేళ పెళ్లి ఆగిపోయి నా మాట పోతే అదే క్షణం నా ప్రాణం కూడా పోతుంది అని సత్యమూర్తి చెప్తారు. నాన్న అని దేవా అంటాడు. భాను వాళ్లకి కన్నీటిని.. నాకు మాట తప్పాను అన్న మాటని తీసుకురాకురా అని సత్యమూర్తి అంటారు.
శారద కొడుకుతో ఈ పెళ్లి ఆగిపోతే భాను, వాళ్ల అమ్మ అక్కడే ప్రాణాలు తీసుకుంటారు. అటు మిథున వాళ్ల కుటుంబం, ఇటు మన కుటుంబం, భాను వాళ్ల కుటుంబం బాగుండాలి అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి గుర్తు పెట్టుకో అని చెప్తుంది. దేవా వాళ్లు పెళ్లి కోసం గుడికి బయల్దేరుతారు.
దేవా వాళ్ల పెళ్లి జరిగే గుడి దగ్గరే మిథున వాళ్ల పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. జడ్జిగారి పెళ్లి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఇన్విటేషన్ ఉన్న వాళ్లనే లోపలికి పిలిచి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మిథున వాళ్లు అందరూ వస్తారు. అలంకృత అక్కని ఆట పట్టిస్తూ సందడి చేస్తుంది. రిషి తల్లిదండ్రులతో కలిసి ముందే గుడికి వచ్చేస్తాడు. తల్లిదండ్రులు అప్పుడే అమెరికా నుంచి రావడంతో వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మిథున వాళ్లని చూసి అందరూ అక్కడికి వెళ్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మేనకోడలే ఇంటికోడలు అవుతున్నందుకు రిషి తల్లి లక్ష్మీ చాలా సంతోషపడుతుంది. ఇక అలంకృత అయితే నాకు మరదలి కట్నం ఇవ్వండి అని అంటుంది. ఆడపడుచు కట్నం తెలుసుకానీ ఈ మరదలి కట్నం ఏంటి అని రిషి అడిగితే ఇప్పుడే పెట్టానని అంటుంది.
గుడిలో పెళ్లి ఏంటి ఏర్పాటు చేశారు అని రిషి తండ్రి ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాతే మిథున పుట్టింది అందుకే ఇక్కడే పెళ్లి చేయాలి అని మొక్కుకున్నాం అని హరివర్థన్ చెప్తాడు. ఇక రాహుల్ అయితే రిసెప్షన్ మాత్రం స్టార్ హోటల్‌లోనే ఏర్పాటు చేస్తామని అంటాడు. టైం అవుతుందని మిథునని రెడీ చేయడానికి అలంకృత, లలిత తీసుకెళ్తారు.
రాహుల్ అక్కడే ఉన్న దేవా, భానుల పెళ్లి ఫ్లెక్సీ చూస్తాడు. త్రిపుర రాహుల్‌తో అయితే ఇక పెళ్లి జరిగినట్లే.. మరోసారి మిథున పెళ్లి పీటల మీదకు వచ్చి ఆగిపోతుందని అంటుంది. అపశకునాలు ఏంటి అని రాహుల్ అడిగితే ఆ రౌడీ ఇంటి చుట్టూ చాలా గుడులు ఉన్నాయి అయినా ఇక్కడే వాడి పెళ్లి ఏర్పాటు చేశాడు అంటే ఏదో ప్లాన్ ఉందని అర్థం కాలేదా.. దేవా మిథున మాత్రమే దూరంగా ఉన్నారు. వాళ్ల మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. అందుకు నిదర్శనమే మొన్న మీ చెల్లి ఆ రౌడీకి రెండు రోజులు మన ఇంట్లో సేవ చేయడం.. వాళ్లకి అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ పెళ్లి జరగనిస్తారా చెప్పండి త్రిపుర అడుగుతుంది. దాంతో రాహుల్ తన మనుషుల్ని పిలిచి దేవా పెళ్లి ఆపాలని ఏదో ఒకటి చేస్తాడు. వాడు మా చెల్లి పెళ్లి మండపంలోకి వస్తే నరికేయండి అని చెప్తాడు.
దేవా వాళ్లు కూడా గుడికి వచ్చేస్తారు. భాను వాళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అనుకునేలోపు భాను వాళ్లు కూడా వస్తారు. దేవాని పెళ్లి కొడుకులా చూసి భాను చాలా సంతోషపడుతుంది. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ ఆపుతారు. దేవాకి కూడా పెళ్లి అని చెప్పడంతో పెళ్లి మండపం బుక్ చేసుకున్న రసీదు అడుగుతారు. అది చూపించగానే మీరు కుడి వైపు వెళ్లండి.. ఎడమ వైపు వెళ్లకండి అక్కడ జడ్జిగారి అమ్మాయి పెళ్లి జరుగుతుందని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















