సినిమాల్లో ట్రై చేస్తున్నా, అందుకే ఈ కుర్రవేషాలు: ఎల్బీ శ్రీరామ్
ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్.. న్యూ ఇయర్ సందర్భంగా ఫన్నీ పోస్టుతో ఆకట్టుకున్నారు. కుర్రాడిలా మారిపోయి మళ్లీ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నానని వెల్లడించారు.
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు చాలామంది అనేక రెసొల్యూషన్స్ తీసుకుంటుంటారు. అయితే కొందరు తాము ఏం చేయాలనుకుంటారు, సాధించాలనుకుంటున్నారో మనసులోనే ఉంచుకుంటుంటారు. మరికొందరు మాత్రం బాహాటంగా అందరికీ తమ లక్ష్యాలను చెబుతుంటారు. సరిగ్గా ఇలానే చేశారు ప్రముఖ తెలుగు సినీ నటులు ఎల్బీ శ్రీరాం. ఈయన దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించట్లేదు. కానీ తన యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. అడపాదడపా పలు యూట్యూబ్, టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు. ఈక్రమంలో న్యూయర్(2023) సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా... కొత్త కుర్రాణ్ణి కనుక కుర్ర వేషాలేస్తున్నా’’ అంటూ పసుపు రంగు చొక్కాలో తెల్ల రంగు నిక్కర్‌తో స్టైల్‌గా నడుస్తున్నట్లు ఓ ఫోటోను ట్విట్టర్‌లో శ్రీరామ్ పోస్టు చేశారు. ఈ పోస్టులో మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా కలర్ ఫుల్ షర్ట్, కూలింగ్ గ్లాసెస్‌తో కనిపించారాయన. ఇది చూసిన ఆయన ఫాలోవర్స్ ‘‘కొత్త లుక్‌తో కేక పుట్టించేశారు’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘లవర్ బాయ్(ఎల్బీ), రచయితలకి వయసేంటి మాస్టారు?, మీరు నిత్య యవ్వనులు సార్’’ అంటూ న్యూఇయర్ విషెస్ చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాలలో ఎల్బీ బిజీబిజీ
ఎల్బీ శ్రీరామ్ నటించిన చివరి సినిమా ‘మేరా భారత్ మహాన్’. ఈ చిత్రం 2019లో విడుదలైంది. దాని తర్వాత సినిమాల్లో ఆయన పెద్దగా నటించలేదు. ఈ ఏడాది రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కొండా’ చిత్రంలో కొండా కొమురయ్య పాత్రలో కనిపించారు ఎల్బీ. వాస్తవానికి సినిమాలకంటే సోషల్ మీడియాలోనే ఆయన యాక్టివ్‌గా మారిపోయారని చెప్పవచ్చు. తన యూట్యూబ్ ఛానల్‌లో సామాజిక చైతన్యం కల్పించే షార్ట్ ఫిలింస్, సమాజానికి ఉపయోగపడే కథలను షార్ట్ ఫిల్మ్స్‌గా నిర్మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర
Hii🙋♂️FRIENDS
— LB Sriram (@LB_Sriram) January 1, 2023
Happy😍NewYear
కొత్త సంవత్సరంలో
కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం..
నేను సినిమాల్లో ట్రై చేద్దాం
అనుకుంటున్నాను..
కొత్త కుర్రాణ్ణి కనక..
కుర్రవేషాలేస్తున్నా! pic.twitter.com/CX825KPCR7
ఎల్బీ శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం లేని పేరు. ఆయన కమెడియన్‌గా, రచయితగా, నిర్మాతగా డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు. 'చాలా బాగుంది' సినిమాతో నటుడిగా బ్రేక్ అందుకున్న ఎల్బీ శ్రీరామ్.. 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబ పెద్ద పడే బాధలు, ఇబ్బందులను తెలియజేసేలా శ్రీరామ్ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కంటనీరు తెప్పించింది అనడంలో అతిశయోక్తి లేదు. హనుమాన్ జంక్షన్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఆది, దిల్, ఛత్రపతి, ఎవడి గోల వాడిది, స్టాలిన్, సీమశాస్త్రి, గమ్యం, ఎవడు, లెజెండ్, సరైనోడు.. తదితర సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులుచ, పురస్కారాలు పొందారాయన. ముప్పై ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల సిల్వర్‌స్ర్కీన్‌పై అరుదుగా కనిపిస్తోన్న ఆయన అమృతం సీక్వెల్ ‘అమృతం ద్వితీయం’ వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ బ్యానర్‌లో తెరకెక్కించిన కవి సామ్రాట్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించారు.
Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది