నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ.. నాగార్జున హాజరు డౌటే!
ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వెల్లడిస్తారు.
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి శనివారం టాలీవుడ్ పెద్దలతో చర్చించనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే, ఈ మీటింగ్ ఎన్ని గంటలకు అనేది మాత్రం తెలియరాలేదు. కోవిడ్-19 నిబంధనల వల్ల ఆరుగురు కంటే ఎక్కువ మందిని జగన్‌ను కలిసేందుకు అనుమతించరని తెలిసింది. ఈ నేపథ్యంలో జగన్‌తో చర్చించేందుకు వెళ్లేవారు ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే, సీఎం అపాయింట్‌మెంట్ విషయంలో ఇంకా సందిగ్ధత ఉంది. సీఎంను కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు వెయిట్ చేయాల్సి రావచ్చని తెలిసింది.
నాగార్జున హాజరవుతారా?: ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున హాజరవుతారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఆదివారం (సెప్టెంబరు 5) నుంచి స్టార్ మా టీవీలో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున శుక్రవారం నుంచి శనివారం వరకు షూటింగులో బిజీగా ఉండవచ్చని, దాని వల్ల ఆయన సమావేశానికి హాజరు కాకపోవచ్చని భావిస్తున్నారు. ఒక వేళ షూటింగ్ శుక్రవారం రాత్రి ముగిస్తేనే నాగ్ మీటింగులో పాల్గొనే అవకాశాలు ఉంటాయి.
మహేష్ బాబు, బన్నీ వెళ్తారా?: ఈ మీటింగ్‌కు చిరంజీవి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన నాగ్ కూడా చిరుతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల కిందట చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి కూడా నాగ్ హాజరయ్యారు. ఒక వేళ నాగ్ రాకపోతే.. చిరు వెంట ఎవరు ఉంటారనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు.. చిరు వెంట వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ.. సీఎం జగన్‌ను కలిసే అవకాశాలు దాదాపు లేవు. ఈ మీటింగులో నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ మూవీస్ రవి ప్రసాద్, నారాయణ మూర్తి, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్, కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి.కళ్యాన్, ఎన్వీ ప్రసాద్, దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రీయ, యూవీ క్రియేషన్స్ బాబీ, వంశీతోపాటు నిర్మాతల సంఘం, పంపిణీ రంగాలకు చెందిన పెద్దలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
మీటింగ్ ఎందుకంటే..: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎక్కువగా సినిమా థియేటర్లు సరిగ్గా నడవడం లేదు. ఈ కారణంగా ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోయారు. అదే సమయంలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గించేసింది. దీంతో థియేటర్లకు వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోతోంది. ఇదే ప్రధానమైన సమస్యగా ఉంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ వల్ల సినీ, థియేటర్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను జగన్‌కు వివరిస్తారు. అలాగే బీ, సీ సెంటర్లలో టికెట్ ధరలు, విద్యుత్ టారిఫ్‌ల గురించి కూడా చర్చించారు. ఇటీవల ఏపీలో జారీ జీవో, చిన్న నిర్మాతల సమస్యలు గురించి సీఎం భేటీలో మాట్లాడనున్నారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లోని థియేటర్ల టిక్కెట్టు ధరలు, చిన్న సినిమాల మనుగడ కోసం 5 షోలకు అనుమతివ్వాలని సీఎంకు కోరనున్నట్లు తెలిసింది. విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.