Vyuham movie: 'వ్యూహం' విడుదలకు బ్రేక్ - జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు
Vyuham movie: వ్యూహం విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. జనవరి 11వ తేదీ వరకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా రద్దు చేసింది. టీడీపీ పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.
![Vyuham movie: 'వ్యూహం' విడుదలకు బ్రేక్ - జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు Telangana High Court Order to brake on vyuham movie release Vyuham movie: 'వ్యూహం' విడుదలకు బ్రేక్ - జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/b66d9b086a52cc0f23197a0c25c9b39a1703823031453841_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vyuham movie release date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా... ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. డిసెంబరు 29న (శుక్రవారం) రిలీజ్ కావాల్సిన ఉన్న ‘వ్యూహం’ సినిమా విడుదలను ఆపేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా ఇవాళ రిలీజ్ కావడంలేదు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. జనవరి 11న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.
’వ్యూహం‘ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని... ఆ పార్టీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని కూడా ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. నిన్న (గురువారం) ఉదయం 11 గంటల 45 నుంచి సాయంత్రం వరకు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నంద రాత్రి 11గంటల 30 నిమిషాల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
రామ్‌గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా పూర్తిగా వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉందని టీడీపీ వాదిస్తోంది. ఈ విషయాన్ని ఆర్జీవీ కూడా అంగీకరించారు. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, తండ్రికి ఇచ్చిన మాటను కొడుకు ఎలా నిలబెట్టుకున్నాడు అనే కోణంలో సినిమా ఉంటుందని చెప్పారు. వైఎస్ మరణానంతరం జగన్ పడిన కష్టాలు... ఆయనపై జరిగిన కుట్రలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని వైఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను అభ్యంతరకరంగా చూపించారనేది.. ఆయన తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణ. సినిమా ట్రైలర్‌ను బట్టి ఇది అర్థమవుతోందని అంటున్నారు. అందుకే కోర్టులో పిటిషన్ వేశారు. నిన్నంతా వాదనలు జరగ్గా, ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తూ... అర్థరాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.
కోర్టు ఆదేశాలపై వ్యూహం నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేవలం ట్రైలర్ చూసి విడుదల ఆపేయడం సరికాదని అంటున్నారు. పైగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత... సినిమాలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదని వాదిస్తున్నారు. 10 మంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ, తమ సినిమా చూసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని... వాటన్నింటికీ వివరణ ఇచ్చుకున్న తర్వాతే సర్టిఫికేట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపారు వ్యూహం సినిమా నిర్మాతల తరపు న్యాయమూర్తులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... సినిమా రిలీజ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇవాళ విడుదల కావల్సిన వ్యూహం సినిమా రిలీజ్ ఆగిపోయింది.
Also Read: దిల్ రాజు బ్యానర్‌లో ‘బేబీ‘ బ్యూటీకి ఛాన్స్, ఆశిష్ తో వైష్ణవి చైతన్య రొమాన్స్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)