Krishna Last Rites: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు
Last Rites Of Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర విషయంలో కుటుంబ సభ్యులు మార్పులు చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శన కోసం భౌతికకాయం ఉంచుతామని చెప్పినా, ఆ తర్వాత రద్దు చేశారు.
Last Rites Of Super Star Krishna: నేటి (మంగళవారం) తెల్లవారుజామున కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా పలు మార్పులు చేర్పులు చేశారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం దగ్గరే ఉంచనున్నట్లు ప్రకటించారు. అభిమానులుఅక్కడికే వెళ్లి నివాళులు అర్పించాలని సూచించారు. రేపు (బుధవారం) మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.
View this post on Instagram
విజయనిర్మల నివాసం నుంచి నేరుగా మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర
కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి భౌతిక కాయాన్ని తరలించారు. మంగళవారం సాయంత్రం వరకూ సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు చెప్పారు. కానీ, ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. నేరుగా విజయ నిర్మల నివాసం నుంచి మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నమే అంత్యక్రియలు పూర్తవుతాయని తెలిపారు.
అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు.
దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022
కృష్ణకు అభిమానుల ఘన నివాళి
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చి కృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పిస్తోంది. అన్ని చోట్లా నుంచి అభిమానులు.. తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.