Madhavan: 'రాకెట్రీ' సినిమాలో షారుఖ్, సూర్య గెస్ట్ రోల్స్ - ఎంత ఛార్జ్ చేశారంటే?
'రాకెట్రీ' సినిమాలో షారుఖ్, సూర్య గెస్ట్ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే. దానికోసం వారు ఎంత ఛార్జ్ చేశారంటే?
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్.మాధవన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు. కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు మాధవన్. 'సవ్యసాచి' సినిమాతో నేరుగా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారాయన. ఇప్పటివరకు నటనకు మాత్రమే పరిమితమైన మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూలై 1న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాధవన్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్స్ చేశారు. ఇంత పెద్ద స్టార్స్ తన సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించడానికి మాధవన్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారా..? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ విషయంపై స్పందించిన మాధవన్.. షారుఖ్ ఖాన్, సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే తన సినిమాలో నటించారని చెప్పారు. ముందుగా షారుఖ్ గురించి చెబుతూ.. ''జీరో సినిమాలో షారుఖ్ తో కలిసి నటించినప్పుడు 'రాకెట్రీ' సినిమా గురించి చెప్పాను. తరువాత ఓ పార్టీలో ఆయన్ను కలిసినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ నన్ను రాకెట్రీ సినిమా గురించి అడిగారు. తను కూడా సినిమాలో భాగంగా కావాలనుకుంటున్నానని.. బ్యాక్ గ్రౌండ్ లో చిన్న రోల్ ఉన్నా చేస్తానని చెప్పారు. ఆయన జోక్ చేస్తున్నారనుకున్నా. ఆ తరువాత నా వైఫ్ షారుఖ్ మాటలకు థాంక్స్ చెప్పమనడంతో.. ఆయన మేనేజర్ కి మెసేజ్ చేశా. అప్పుడామె షారుఖ్ సార్ డేట్స్ గురించి అడగమంటున్నారు అని రిప్లై ఇచ్చింది. ఆ విధంగా ఆయన మా సినిమాలో భాగమయ్యారు'' అంటూ చెప్పుకొచ్చారు మాధవన్.
అలానే సూర్య కూడా ఈ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తో ముంబైకి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారని.. తన క్రూతో పాటు వచ్చారని.. కనీసం ఫ్లైట్ టికెట్స్ కోసం కూడా డబ్బు తీసుకోలేదని.. మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకున్నారని చెప్పారు మాధవన్. ఇండస్ట్రీలో తను అవుట్ సైడర్ అయినప్పటికీ.. ఈ స్థాయికి ఎదగడానికి చాలా మంది సాయం చేశారని అన్నారు మాధవన్.
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్
View this post on Instagram