Shabaash Mithu Trailer OUT: శభాష్ మిథు ట్రైలర్ వచ్చేసింది, తాప్సీ యాక్టింగ్ వేరే లెవల్
తాప్సీ టైటిల్ రోల్‌లో నటించిన శభాష్ మిథు మూవీ ట్రైలర్ విడుదలైంది. మిథాలీ పాత్రలో తాప్సీ అద్భుతంగా యాక్ట్ చేశారు.
విమెన్ ఇన్ బ్లూ నా కల అంటున్నారు తాప్సీ. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన శభాష్ మిథు మూవీ ట్రైలర్ విడుదలైంది. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో మిథాలీగా అద్భుతంగా నటించారు తాప్సీ. ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయేందుకు ఎంత శ్రమించారో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్‌లో కనిపించిన ప్రతి సీన్‌లో చాలా ఎమోషనల్‌గా యాక్టింగ్ చేశారు. మెన్ ఇన్ బ్లూ లాగానే విమెన్ ఇన్ బ్లూ అని అందరూ చెప్పుకోవాలన్నదే నా కల అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరించింది. మహిళలు క్రికెట్ ఆడటాన్ని చులకనగా చూసిన వారందరికీ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చిన మిథాలీ రాజ్...కెప్టెన్ స్థాయికి ఎలా ఎదిగారనేదే ఈ కథ. క్రికెట్‌లో మహిళలపై ఉన్న వివక్షను తట్టుకుని నిలబడి..ఆడవాళ్లూ క్రికెట్‌లో రాణించలగరని నిరూపించారు మిథాలీ. అయితే ఈ ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు దాటుకుని వచ్చారు. వాటన్నింటినీ ఈ ట్రైలర్‌లో చాలా సహజంగా చూపించారు. మిథాలీ పాత్రలో తాప్సీ అదుర్స్ అనిపించారు.
View this post on Instagram
ముఖ్యంగా పురుషుల జెర్సీల్నే మహిళలకు ఇవ్వటం, సరైన విధంగా ప్రోత్సహించకపోవటం లాంటి సమస్యలతో మిథాలీ రాజ్ ఎంత సతమతమయ్యారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. జులై 15వ తేదీన ఈ సినిమా విడుదలవనుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు మహిళా క్రికెట్‌కు సేవలందించిన మిథాలీ రాజ్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు.