Samantha: గుణశేఖర్ మాటలకు సమంత కన్నీరు - ఏమన్నాడంటే?
శాకుంతలం ట్రైలర్ లాంచ్‌లో గుణశేఖర్ మాటలకు సమంత ఎమోషనల్ అయ్యారు.
సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత ఎమోషనల్ అయ్యారు. గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ‘శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు శామ్ ఎమోషనల్ అయ్యారు. మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. తన గత సినిమా ‘యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయారు.
ఇక ‘శాకుంతలం’ ట్రైలర్ విషయానికి వస్తే... ఈ భూమి మీద అమ్మ నాన్నలు అక్కర్లేని తొలి బిడ్డ, మేనక, విశ్వమిత్రుల ప్రేమకు గుర్తు ఈ బిడ్డ. అప్సరసకు బిడ్డైనప్పటికీ అనాథలా మిగిలిందే అంటూ శకుంతల పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత దుష్యంతుడితో ప్రేమ, రాజప్రాసదంలో గర్భవతిగా ఉన్న శకుంతలకు అవమానం, అనంతరం జరిగే పరిణమాలు, యుద్ధాలు తదితర ఆసక్తికర సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు.
దుర్వాస మహర్షి పాత్రలో మోహన్ బాబు ఒదిగిపోయారు. ఈ విజువల్స్ అందర్నీ కొన్ని యుగాలు వెనక్కి తీసుకెళ్తుంది. విజువల్స్ క్వాలిటీ విషయంలో ‘బాహుబలి’తో కంపేర్ చేయలేం. కానీ కథకు తగినట్లుగా వీఎఫ్ఎక్స్‌ను అందించారు.
ట్రైలర్ చివర్లో ‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’ అనే డైలాగ్‌ను అందించారు. ఇది ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చివర్లో సింహంపై కూర్చున్న చిన్నారి ఎవ్వరో అనుకున్నారు చాలా మంది. తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ.
గోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించారు. 'శాకుంతలం'లో కనిపించే అసుర రాజు పాత్ర తన కెరీర్‌లో మైలురాయి అని కబీర్ సింగ్ అంటున్నారు. 'శాకుంతలం' సినిమాలో అందమైన ప్రేమకథ మాత్రమే కాకుండా దుష్యంతుడికి, అసుర రాజుకు మధ్య భారీ యుద్ధ సన్నివేశం కూడా ఉంది. పది రోజుల పాటు ఆ వార్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. సినిమాలోని ప్రధాన హైలెట్స్‌లో ఆ ఫైట్ కూడా ఉంటుందని సమాచారం.
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డీఆర్‌పీ (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిన్నారి భరత రాకుమారుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్య నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. దీనికి సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయ్యింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో సీజీ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరకు వచ్చాయని తెలిసింది.
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో ‘శాకుంతలం’ సినిమాను విడుదల చేయనున్నారు. అదే రోజున ధనుష్ 'సార్', విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఎవరైనా వెనక్కి తగ్గుతారా? లేకపోతే నాలుగూ విడుదల అవుతాయా అన్నది చూడాలి.