Thriller Movies On OTT: మనుషులను చంపి, వారి మాంసాన్ని అమ్మే భార్యభర్తలు - ఈ ఆఫర్ వెజిటేరియన్లకు మాత్రమే!
Movie Suggestions: అది మనుషుల మాంసం అని తెలియక ఆ టౌన్‌లోని వ్యక్తులంతా దానికి అలవాటు పడతారు. బిజినెస్ బాగా జరుగుతుండడంతో మనుషులను చంపి తెలియకుండానే క్రిమినల్స్‌లాగా మారిపోతారు ఆ భార్యభర్తలు.
Best Thriller Movies On OTT: మనిషిని చంపడం, ఆ మాంసాన్ని తినడంపై పలు సినిమాలు తెరకెక్కాయి. నిజానికి గత కొన్నేళ్లలో ఇది ఒక సెపరేట్ జోనర్‌గా మారిపోయింది. ఇలాంటి సినిమాల్లో చాలా వయొలెన్స్ ఉన్నా కూడా.. దానికి తగిన సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు. రక్తపాతం లాంటివి నచ్చని ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు దూరంగా ఉన్నా.. వీటిని ఆసక్తికరంగా చూసేవారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి జోనర్ చిత్రాల్లో ‘సమ్ లైక్ ఇట్ రేర్’ (Some Like It Rare) కూడా ఒకటి.
కథ..
‘సమ్ లైక్ ఇట్ రేర్’ కథలోకి వెళ్తే.. భార్యభర్తలయిన బ్రెయిన్, సోఫియా.. ఒక చిన్న టౌన్‌లో మాంసం షాప్‌ను నడిపిస్తూ జీవనం సాగిస్తుంటారు. కానీ వారి బిజినెస్ అంత బాగా నడవదు. అసలే బిజినెస్ సరిగా లేదు అనుకుంటున్న సమయంలో బ్రెయిన్, సోఫియా షాప్‌పై కొందరు వెజిటేరియన్లు దాడి చేస్తారు. ఆ టౌన్‌లో ఇది సాధారణంగా జరిగే విషయమే. మాంసం అమ్మడం ఆపేయాలని అప్పుడప్పుడు వెజిటేరియన్లు ఇలా చేస్తుంటారు. అలా దాడి చేసిన సమయంలో అందులో ఒకడి మొహాన్ని బ్రెయిన్ చూసేస్తాడు. ఒకరోజు బ్రెయిన్, సోఫియా ఇద్దరూ తమ ఫ్రెండ్ టోబీ ఇంటికి లంచ్‌కు వెళ్లి వస్తుంటారు. దారిలో వాళ్లకు షాప్‌పై దాడి చేసిన యువకుడు కనిపిస్తాడు. అతడిని కారుతో ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణిస్తాడు. ఏం చేయాలో తెలియక ఆ శవాన్ని తమ షాపుకు తీసుకెళ్తారు. దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెడతాడు బ్రెయిన్.
మరుసటి రోజు బ్రెయిన్‌కు తెలియకుండా ఆ వ్యక్తి మంసాన్ని అమ్మడం మొదలుపెడుతుంది సోఫియా. ఆ మాంసం చాలా రుచిగా ఉందంటూ దానిని కొన్న మహిళ.. మళ్లీ వాళ్ల షాప్‌కు వస్తుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదనుకున్న బ్రెయిన్.. ఆ మాంసాన్ని పడేద్దాం అనుకుంటాడు. కానీ దానికోసం వరుసగా కస్టమర్లు రావడం చూసి షాకవుతాడు. అందుకే పడేయకుండా దానిని అమ్మడం మొదలుపెడతాడు. అలా ఒక్కరోజులో ఆ మనిషి మాంసం వల్ల వారి బిజినెస్ బాగా జరుగుతుంది.
ఆ మాంసాన్ని బ్రెయిన్ కూడా కొంచెం రుచిచూస్తాడు. దాని టేస్ట్ బాగుంది కాబట్టే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తున్నారని తెలుసుకుంటాడు. అప్పటినుండి వెజిటేరియన్లను చంపి వారి మాంసాన్ని అమ్మాలని బ్రెయిన్, సోఫియా నిర్ణయించుకుంటారు. అలా ఒక రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉండే చెఫ్‌ను చూసి అతడిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తర్వాత వెజిటేరియన్ల మాంసం కోసం ఆ భార్యభర్తలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అన్నది తెరపై చూడాల్సిన కథ.
‘సమ్ లైక్ ఇట్ రేర్’ కథ మొత్తం దాదాపుగా బ్రెయిన్, సోఫియా చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో నటించిన ఫ్యాబ్రిస్, మరీనా నటన కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులను భయపెట్టేలా అనిపిస్తుంది. ఫ్యాబ్రిస్.. ఇందులో లీడ్ రోల్‌లో నటించడంతో పాటు తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. మనుషుల మాంసానాకి సంబంధించిన సినిమా కాబట్టి ఇందులో రక్తపాతం ఎక్కువగానే ఉంటుంది. ఒరిజినల్‌గా ఇది ఒక ఫ్రెంచ్ సినిమా. అయినా కూడా ‘సమ్ లైక్ ఇట్ రేర్’ అనే టైటిల్‌తో ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో పలు సీన్స్ అనవసరం అనిపించినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునేవారు యాపిల్ టీవీలో చూసేయొచ్చు.