Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Rana Naidu 2: వెంకటేశ్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ సీజన్ 2 షూటింగ్ మొదలయ్యింది. అంతే కాకుండా ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడానికి ‘ఏజెంట్’ నటుడిని సెలక్ట్ చేశారు మేకర్స్.
Rana Naidu 2 Update: ఈరోజుల్లో స్టార్ హీరోలు సైతం ఓటీటీ కంటెంట్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గతేడాది దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా, వెంకటేశ్ కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘రానా నాయుడు’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడడం ప్రేక్షకులకు చాలా నచ్చింది. అందుకే ఈ సిరీస్‌కు సీజన్ 2ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సీజన్ 2లో పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కోసం ‘ఏజెంట్’ నటుడిని రంగంలోకి దించనుందట మూవీ టీమ్. ప్రస్తుతం ‘రానా నాయుడు 2’కు సంబంధించిన ఈ అప్డేట్ వైరల్ అవుతోంది.
షూటింగ్ మొదలు..
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ఏజెంట్’లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించాడు డినో మోరియా. సినిమా ఎలా ఉన్నా తన క్యారెక్టర్‌కు మాత్రం న్యాయం చేశాడు ఈ నటుడు. కానీ ‘ఏజెంట్’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వకపోవడంతో తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత ‘రానా నాయుడు 2’తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘రానా నాయుడు 2’లో డినో మోరియా.. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అంతే కాకుండా ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ అప్డేట్‌ను బట్టి చూస్తే మిగతా క్యాస్టింగ్ కూడా త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.
మొదటిసారి నెగిటివిటీ..
‘రానా నాయుడు’ మొదటిసారి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యి ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ సిరీస్‌కు సీజన్ 2 ఉండే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ ముందుగానే ప్రకటించినా.. దాని గురించి ప్రేక్షకులు పెద్దగా చర్చించుకోలేదు. ఇక ‘రానా నాయుడు’ కథ విషయానికొస్తే.. ఇందులో వెంకటేశ్, రానా తండ్రి కొడుకులుగా నటించారు. ఇన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరో అని గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్. ‘రానా నాయుడు’ వల్ల అలాంటి సీనియర్ హీరో నోటి నుండి బూతులు వినడం వల్ల ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడ్డారు. అంతే కాకుండా ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సిరీస్ వల్ల మొదటిసారి వెంకీ మామ నెగిటివిటీ కూడా ఎదుర్కున్నారు.
ఎగ్జైటింగ్‌గా లేదు..
అమెరికన్ క్రైమ్ సిరీస్ ‘రే డొనొవన్’కు రీమేక్‌గా తెరకెక్కింది ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ.. దీనికి దర్శకులుగా వ్యవహరించారు. 2023 మార్చి 10న ఈ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఇందులో వెంకటేశ్, రానాతో పాటు సుచిత్ర పిల్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ‘రానా నాయుడు 2’లో కూడా ఈ నటీనటులంతా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక డినో మోరియా విషయానికొస్తే.. తను ఇప్పటికే ‘ఏజెంట్’లో విలన్‌గా నటించడంతో పాటు ‘ది ఎంపైర్’, ‘తాండవ్’, లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. ఓటీటీలో వెబ్ సిరీస్‌లను ఫాలో అయ్యేవారికి డినో మోరియా సుపరిచితమే.