Crime News: ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
Telangana Crime: ఖమ్మం జిల్లాలో ఓ కొడుకు ఫోన్ కొనడానికి డబ్బులివ్వలేదని తల్లిని హత్య చేశాడు. నవమాసాలు మోసి కన్నందుకు తల్లినే కాటికి పంపేశాడు.
Mother Murder: పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు కానీ.. కొంత మంది నరకానికి పంపేవారుంటారు. అలాంటి వ్యక్తే ఖమ్మం జిల్లాకు చెందిన గోపి. జన్మనిచ్చిన తల్లిని చంపేశాడు. అదీ కూడా లవర్ కు ఫోన్ కొనివ్వడానికి..!
మద్యానికి బానిసైన గోపి
ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ, వాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు గోపి మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. ఎన్ని సార్లు మందలించినా తీరు మార్చుకోలేదు. మద్యానికి డబ్బులివ్వాలని ఇంట్లో వారిని వేధించేవాడు. ఇటీవల అతను ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఫోన్ గిఫ్టుగా అడిగిందని.. ఆ ఫోన్ కొనివ్వడానికి డబ్బులు కావాలని తల్లిదండ్రుల్ని వేధించడం ప్రారంభించాడు.
అయితే వారు తమ దగ్గర లేవని చెబుతూ వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తల్లి మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో మరోసారి డబ్బు కోసం ఒత్తిడి ప్రారంభించాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఒంటిపై ఆభరణాలైనా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆ తల్లి మండిపడింది. ఏం చేస్తున్నావో తెలుస్తున్నావా అని గట్టిగా కేకలేసింది. అయినా సరే పుస్తెల తాడు, చెవిదిద్దులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో తల్లిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. తర్వాత చెవిదిద్దులు, పుస్తెలతాడు తీసుకుని వెళ్లిపోయాడు.
చంపేసి చెవిదిద్దులు, పుస్తెల తాడు తీసుకెెళ్లిన గోపీ
కొంత సేపటి తర్వాత ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని చుట్టుపక్కల వారు చూశారు. ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్త వచ్చి చూసేసరికి చనిపోయి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అక్కడ పడి ఉన్న ఓ కర్చీప్ ని జాగిలం చూపించింది. దీనిపై ఆరా తీయగా, గోపీదని తేలినట్టు సమాచారం. దీంతో ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా వైరాలో అదుపులోకి తీసుకున్నారు.
గోపీనే హత్య చేశాడని గుర్తించిన జాగిలం
ఈ కొడుకు చేసిన పని ఖమ్మం నగరంలో కలకలం సృష్టించింది. నగలు తీసుకుని ఏం చేశాడన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోపితో ఎప్పుడూ మాట్లాడే అమ్మాయిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.