Unstoppable With NBK Limited Edition EP 1: ఊరి కోసం రోడ్డు వేయించిన అడవి బిడ్డకు ‘అన్‌స్టాపబుల్’ ఆర్థిక సాయం
ఆమె ఊరిలో రోడ్లు వేయ్యించేందుకు.. తన ఇంటి కోసం దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టింది. ఈ సందర్భంగా ‘భగవంత్‌కేసరి’ నిర్మాత ఆమెకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు.
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో మళ్లీ బుల్లితెరపైకి వచ్చారు. ఈ సారి మరింత ఎనర్జీతో లిమిటెడ్ షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ మంగళవారం సాయంత్రం ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైంది. ఈ షోలో ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్, శ్రీలీలా, విలన్ అర్జున్ రాంపాల్ వచ్చారు. ఈ షో ఆధ్యాంతం సరదాగా సాగింది. బాలయ్య.. అనిల్, కాజల్, శ్రీలీలతో ఓ ఆట అడుకున్నారు. షో చివరిలో సామాజిక సేవ చేస్తున్న ఓ అడవి బిడ్డను సత్కరించారు. అంతేకాదు, ఆర్థిక సాయం కూడా అందించారు. ఊరి కోసం తన సొంత ఇంటికి దాచుకున్న డబ్బును సైతం ఖర్చుపెట్టి రోడ్డు వేయించిన ఆ ఆడపులి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని బాలయ్య కొనియాడారు.
ఎవరీ అడవి బిడ్డ జమ్మి?
ఆడ పిల్ల అంటే జింక లెక్క కాదు.. పులి లెక్క ఉండాలనే సందేశాన్ని ‘భగవంత్ కేసరి’ మూవీలో చూపిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నిజమైన ఆడపులిని చూపిస్తానంటూ.. ఓ వీడియోను చూపించారు. అందులో ఉన్నది మరెవ్వరో కాదు.. తోటగుట్టిపట్టు గిరిజన తాండాకు చెందిన జమ్మి. ఆమె తన తండాలో నాలుగేళ్లుగా ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది. నెలకు రూ.4 వేల జీతంతో ఊరి ప్రజలకు సేవ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఊర్లోవారికి దగ్గు జ్వరం వస్తే మందులిస్తా. గర్బిణీ స్త్రీలను హాస్పిటల్‌కు తీసుకెళ్తా. అయితే, ఊరిలో రోడ్లు బాగోలేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. టీబీతో బాధపడుతున్న మా పిన్నిని హాస్పిటల్‌కు వెళ్లే లోపే చనిపోయింది. అందుకే, ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న మొత్తంతో ఊరిలో రోడ్లు వేయించాను. ఇందుకు నా భర్త కూడా తోడుగా నిలిచారు’’ అని ఆమె వెల్లడించింది. ‘‘ఊరిలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్‌కు తీసుకెళ్లడం చాలా కష్టం. కనీసం వాహనం కూడా లోపలికి రాలేదు. అందుకే, డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేయించాను’’ అని ఆమె తెలిపింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నువ్వు చేసిన పని ఎంతోమందికి ప్రేరణ ఇస్తుంది. ప్రజల కోసం నువ్వు నిలబడిన వైనం.. నిన్ను ‘అన్‌స్టాపబుల్’ చేసింది’’ అని అన్నారు. అనంతరం నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘‘ఎవరూ తమ ఊరు గురించి ఆలోచించే రోజులు కావు ఇవి. మారుమూల ప్రాంతానికి చెందిన మీరు ఆ ఆలోచన చేశారంటే చాలా గ్రేట్’’ అని తెలిపారు. అనంతరం ఆయన.. బాలయ్య, కాజల్ చేతులు మీదుగా రూ.2 లక్షల చెక్‌ను ఆమెకు అందించారు. అలాగే స్పాన్సర్ నుంచి మరో రూ.50 వేలు చెక్ కూడా ఇచ్చారు. ఇక ‘భగవంత్ కేసరి’ మూవీ విషయానికి వస్తే.. ఈ నెల 19న (గురువారం) విడుదల కానుంది.
Also Read: బాలయ్యలో మీకు నచ్చనది ఏమిటీ? కాజల్‌కే షాకిచ్చేలా శ్రీలీలా సమాధానం - ఆ వీడియోలు మార్ఫింగ్ అంట!