Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
బాలకృష్ణ పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్న సందర్భంగా ‘నర్సు బాగుండేది’ అంటూ ఓ మాట ఫ్లోలో అనేశారు. దానిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి.
అన్‌స్టాపబుల్ షో వేదికగా నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆహా ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్ 2 షో ప్రసారం కాగానే ఈ అంశంపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బాలకృష్ణ పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్న సందర్భంగా ‘నర్సు బాగుండేది’ అంటూ ఓ మాట ఫ్లోలో అనేశారు. దానిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి.
దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ నర్సులను కించపర్చానంటూ కొంత మంది చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ఆస్పత్రిలో కూడా నర్సులు రోగులకు రాత్రింబవళ్లు సేవలు చేస్తుంటారని చెప్పారు. వారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువేనని అన్నారు. వారిని తన సోదరీమణులుగా అభివర్ణించారు. ఒకవేళ మనోభావాలు దెబ్బతీసినట్లయితే పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పారు.
‘‘అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ... మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలకృష్ణ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.
ఇటీవలే పవన్ కల్యాణ్ పార్ట్ 1 ఎపిసోడ్‌లో బాలయ్య.. డిగ్రీ నిజాం కాలేజీలో చదివేటప్పుడు తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి పవన్‌కు వివరించారు. ఆ సందర్భంగా తనకు వైద్యం చేసిన నర్సును ఉద్దేశించి.. ఆ నర్సు భలే అందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.