Liger Movie Issue: 'లైగర్' తెచ్చిన కొత్త చిక్కులు, పోలీస్ స్టేషన్‌లో పూరి జగన్నాథ్ ఫిర్యాదు
లైగర్ సినిమా భారీ పరాజయం కావడంతో డిస్టిబ్యూటర్లకు దర్శకుడు పూరి జగన్నాథ్ కు మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ వచ్చింది.
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో ఇటీవల తెరకెక్కించిన సినిమా 'లైగర్'. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. అయితే లైగర్ దెబ్బతో దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త చుక్కుల్లో పడ్డాడు. లైగర్ సినిమా భారీ పరాజయం కావడంతో డిస్టిబ్యూటర్లకు దర్శకుడు పూరి జగన్నాథ్ కు మధ్య డబ్బులు విషయంలో వివాదం మొదలైంది. ఆ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ వచ్చింది. ఇదే విషయమై ఇటీవలే ఓ ఆడియోను కూడా విడుదల చేశారు పూరీ జగన్నాథ్. దీంతో ఈ వివాదం బయటకొచ్చింది. ఆ ఆడియోలో పూరీ నేను ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. నేను అందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని, నాకు రావాల్సిన డబ్బులు రాగానే క్లియర్ చేస్తాను, ఒక నెల రోజులు గడువు కావాలి ఇవ్వండని, అలా కాకుండా ధర్నాలు అవి చేస్తే వచ్చే డబ్బులు కూడా ఇవ్వను అని తేల్చి చెప్పేశారు పూరీ జగన్నాథ్.
ప్రస్తుతం ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఎంతవరకూ వచ్చిందంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ కొంతమంది డిస్టిబ్యూటర్ల వల్ల తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసే వరకూ వచ్చేసింది. ఇక ఇదే వివాదంపై దర్శకుడు పూరీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్టిబ్యూటర్ల వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు ప్రమాదం ఉందని ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై హింసకు పాల్పడే విధంగా కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తనని తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు పూరీ.
దర్శకుడు పూరీ, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25 న పాన్ ఇండియా లెవల్ లో విడుదలయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేశారు మూవీ టీమ్. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తాం, రూ.200 కోట్లు పైనే వసూళ్లు ఉంటాయని చెప్పారు. అయితే సినిమా విడుదల అయ్యాక అంతా మారిపోయింది. బాక్స్ ఆఫీసు వద్ద సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అనుకున్న వసూళ్లు కూడా రాలేదు. దీంతో డిస్టిబ్యూటర్లు తమకు రావాల్సిన డబ్బుల్ని ఇవ్వాలని పూరీపై ఒత్తిడి తేవడంతో ఆయన కొంత సమయం అడిగారని, అయినా కొంతమంది డిస్టిబ్యూటర్లు పూరీపై ధర్నా చేయాలని నిర్ణయించడంతో ఈ వివాదం కాస్త బయటపడింది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా చూస్తున్న నెటిజనం 'లైగర్' ఇచ్చిన పంచ్ తో ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళందరికి దిమ్మతిరిగిందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Also Read: సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది, చూశారా?