Krishnam Raju Dies - Live Page: కృష్ణం రాజు ఇక లేరు - సోమవారం అంత్యక్రియలు, పార్థీవ శరీరానికి ప్రముఖుల నివాళులు
ప్రముఖ నటుడు, సీనియర్ కథానాయకుడు కృష్ణం రాజు ఇకలేరు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
LIVE
Background
ప్రముఖ నటుడు, సీనియర్ కథానాయకుడు కృష్ణంరాజు (Krishnam Raju) ఇకలేరు. ఈ రోజు ఉదయం తిరిగిరాని లోకాలకు ఆయన వెళ్లిపోయారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆదివారం ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆయన తుదిశ్వాస (Krishnam Raju Death) విడిచారు.
కృష్ణం రాజు స్వస్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. జనవరి 20, 1940న ఆయన జన్మించారు. చదువు పూర్తి చేశాక... నటన మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. 'చిలకా గోరింకా' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. హీరోగా, ఆ తర్వాత విలన్ గా కూడా నటించారు. సినిమాల్లో అలరించిన ఆయన... ఆ తర్వాత రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. కృష్ణం రాజు మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కృష్ణం రాజు కడసారి చూసిన ప్రభాస్...
కృష్ణం రాజు (Krishnam Raju) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ సిటీలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటున్న ఆయన్ను ఆయన్ను చూడటానికి ప్రభాస్ వెళ్లారు. పెదనాన్నను కడసారి చివరి చూపు చూసుకున్నారు. ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లాడని తెలిసిన ఫ్యాన్స్‌కు మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. తొలుత ఆయనకు ఏమైందని ఆందోళన చెందారు. ఆ తర్వాత కృష్ణం రాజుకు బాలేదని తెలిసిన తర్వాత మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
వయోభారంతో కృష్ణం రాజుకు ఆరోగ్య సమస్యలు...
కృష్ణం రాజు వయసు 82 ఏళ్ళు. ఎవరికైనా ఆ వయసులో కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. వయోభారం వల్ల వచ్చిన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల నుంచి ఆయనకు సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సమయంలో కూడా రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు తలెత్తాయి.
'రాధే శ్యామ్'లో అబ్బాయ్ ప్రభాస్‌తో కలిసి నటించిన కృష్ణం రాజు... ఆ తర్వాత నుంచి సినిమాలు, నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా 'రాధే శ్యామ్'.
పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్ బిజీ!
ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సంక్రాంతికి 'ఆదిపురుష్' (Adipurush Movie) తో ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. ప్రభు రామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్ చేశారు. లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ఇప్పుడు 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయిక. ఇది కాకుండా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' (Project K) షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, దిశా ప్యాట్నీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఆ రెండూ పాన్ ఇండియన్ కాదు... పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు. 'ఆదిపురుష్'ను కూడా ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.
ఒకవైపు భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్... మరోవైపు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమాగా అది ఉండబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు. కృష్ణం రాజు మృతితో కొన్ని రోజులు సినిమా షూటింగులకు బ్రేక్ పడనుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఇంటి నుండి సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరనుంది.
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి చేరుకున్న సినీ ప్రముఖులు
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి సినీ ప్రముఖులు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ తదితరులు కృష్ణం రాజు పార్థీవ శరీరానికి నివాళులు అర్పించారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను, ప్రభాస్‌కు సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు పార్థీవ శరీరానికి కేటీఆర్, చంద్రబాబు నాయుడు నివాళులు
కృష్ణంరాజు పార్థీవ శరీరానికి మంత్రి కేటీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇతర ముఖ్య రాజకీయ నేతలు సైతం కృష్ణంరాజు పార్థీవ శరీరానికి నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. జుబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు
రెబల్ స్టార్ కృష్ణంరాజు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కృష్ణంరాజు పార్థివదేహం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 28 లోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. రేపు 1 గంటకి అంతిమ యాత్ర ద్వారా మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.