20 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి జ్యోతిక రీఎంట్రీ
పలు భాషల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అజయ్ దేవ్ గన్, ఆర్. మాధవన్ తో స్ర్కీన్ ను షేర్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది.
Jyotika : తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న నటి జ్యోతిక. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె హిందీ చిత్రాల్లో నటించనుంది. కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ తో స్ర్కీన్ ను షేర్ చేసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాపై తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
జ్యోతిక చేయబోయే ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ పనోరమా స్టూడియోస్ సమర్పణలో రానున్నట్టు సమాచారం. కాగా ఈ మూవీ జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జ్యోతిక మోస్ట్ అవేటెడ్ మూవీకి వికాస్ దర్శకత్వం వహించనుందని ఆయన ప్రకటించారు. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ కాలేదని చెప్పారు. దాదాపు 20ఏళ్ల తర్వాత జ్యోతిక మళ్లీ బాలీవుడ్ లోకి రానుండడంతో ఆమె ఫ్యాన్స్ రాబోయే ఫిలిం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి జ్యోతిక వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె తండ్రి చందర్ సదానా నిర్మాత, సోదరిలు నగ్మా, రోషిణిలు అప్పటికే పలు సినిమాల్లో నటించడంతో జ్యోతికకు ఇండస్ట్రీకి రావడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. 2006 సెప్టెంబర్ 11న సినీ నటుడు సూర్యను వివాహమాడిన జ్యోతిక.. రవితేజ 'షాక్', రజినీ కాంత్ 'చంద్రముఖి', మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్'లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా '36 వయసులో', 'మగువలు మాత్రమే', 'పొన్మగల్ వందాళ్', 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్', 'ఓ మై డాగ్' లాంటి సినిమాలకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. వీటిలో 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
జ్యోతిక తన కెరీర్‌ను హిందీ ఇండస్ట్రీతోనే ప్రారంభించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘దొలీ సజా కే రక్నా’లో ఆమె నటించింది. ఈ చిత్రం 1997లో విడుదలైంది. వైవిధ్య నటుడు రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తుోన్న ‘శ్రీ’ సినిమాలో ఆమె కీలక పాత్రను పోషించనుందని జ్యోతిక ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాకు తుషార్ దర్శకత్వం వహిస్తుండగా, నిధి నిర్మాతగా వ్యవహరించారు.
ఇక 44 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా, అందంగా కనిపిస్తోన్న జ్యోతిక.. బ్యూటీ సీక్రెట్ కు సంబంధించిన ఓ వార్త బయటికొచ్చింది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ జ్యోతిక తనకంటూ ఓ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తన అద్భుతమైన నటనతో అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంలోనే ఆమె ఇటీవల తీవ్రమైన కసరత్తులు చేస్తోన్న ఓ వీడియోను పంచుకున్నారు. అందులో తలక్రిందులుగా మెట్లు దిగడం, తలక్రిందులుగా నిలబడి బంతి ఆడడం వంటి ఎన్నో పనులు చేశారు. ఇప్పటికీ ఆమె ఫిట్ నెస్ కోసం చేస్తోన్న కృషిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నారు.
Read Also: వీకెండ్‌లోనూ అదే పరిస్థితి? ‘కస్టడీ’కి కలెక్షన్స్ కష్టాలు