Janaki Kalaganaledu January 2nd: జ్ఞానంబ ఇల్లు జప్తు చేస్తానన్న వడ్డీవ్యాపారి - రామా ద్రోహం చేశాడన్న జ్ఞానంబ
జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామా అప్పు చేసిన విషయం ఇంట్లో తెలియడంతో గోవిందరాజులకి పక్షవాతం వస్తుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మల్లిక మాత్రం ఇంటి నుంచి వేరు కాపురం పెట్టాల్సిందే అని పట్టుపడుతుంది. అటు వడ్డీ వ్యాపారి కూడా తన డబ్బు ఇప్పుడే కావాలని అడగటంతో ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ టెన్షన్ పడతారు. విష్ణు తీసుకున్న అప్పుకి ఇప్పటి వరకు వడ్డీ కట్టలేదని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. వడ్డీ ఎందుకు కట్టలేదని జ్ఞానంబ అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతాడు. మల్లిక మాత్రం ఉన్న మాటే చెప్పండి అని కరోనా వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం సరిగా లేదని అందుకే కట్టలేదని అంటుంది. మీ గొడవలు తర్వాత నా డబ్బు ముందు కట్టమని వడ్డీ వ్యాపారి భాస్కర్ నిలదీస్తాడు.
Also Read: చారుశీల దగ్గర మాట తీసుకున్న దీప- ఇంద్రుడుని క్షమించమని అడిగిన హిమ
మూడు నెలల సమయం అడిగాను కదా అని రామా అంటాడు. కానీ భాస్కర్ మాత్రం మూడు రోజుల గడువు ఇస్తున్నా డబ్బు కట్టాల్సిందే లేదంటే ఇల్లు జప్తు చేస్తామని చెప్పేస్తాడు. ఆయన అప్పు చేస్తే ఇల్లు జప్తు చేయడం ఏంటని మల్లిక అడుగుతుంది. అదంతా నాకు తెలియదు నాకు డబ్బు ముఖ్యం తేడా వస్తే విషయం పంచాయతీలో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించి వెళతాడు. కలిసి ఉందామని అన్నారు ఇప్పుడు ఇల్లు లేకుండా పోయిందని మల్లిక నోరు పారేసుకుంటుంది. ఎవరికి తెలియకుండా అప్పు చేసింది మీరు పూర్తి బాధ్యత మీదే ఇంటి జోలికి వస్తే ఊరుకునేది లేదని మల్లిక తెగేసి చెప్తుంది. రామా మాట్లాడబోతుంటే జ్ఞానంబ మొహం తిప్పుకుంటుంది. అది తలుచుకుని రామా చాలా బాధపడతాడు. జానకి ఓదార్చడానికి చూస్తుంది. మంచి చేయాలని చూస్తే అది మిమ్మల్ని ఇప్పుడు అందరి ముందు దోషిలా నిలబడిందని జానకి అంటుంది.
ఆరోజు తమ్ముడి భవిష్యత్ తప్ప ఇంకేమీ కనిపించలేదు అందుకే అలా చేశానని రామా అంటాడు. కానీ మీ తమ్ముడు పరిస్థితి అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దోషిలా చూస్తున్నాడని జానకి అంటుంది. నాన్న కోరిక తీర్చాలని నేను చేసిన పనికి కాలు, చెయ్యి పక్షవాతం వచ్చిందని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. జెస్సి అఖిల్ కి నచ్చజెప్పడానికి చూస్తుంది కానీ వినదు. వదినే వెనుక ఉండి ఇలా చేయించిందని అపార్థం చేసుకుంటాడు. జానకి అక్క అలా స్వార్థం చూసుకునే మనిషి కాదని జెస్సి అంటుంది కానీ అఖిల్ మాత్రం తన నోరు మూయిస్తాడు. ఆ డబ్బుతో ఏదో స్థలం కొనుక్కున్నారని నిందిస్తాడు. రామా తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ క్షమించమని అడుగుతాడు.
జ్ఞానంబ: క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు
రామా: స్వార్థం కోసం మోసం చెయ్యడానికి ఈ పని చెయ్యలేదు
జ్ఞానంబ: మోసం కాదు ద్రోహం చేశావ్. నాకు చెప్పకుండా రాముడు ఏ పని చేయడని నమ్మేదాన్ని కానీ నీ భార్య ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు నీళ్ళకి వదిలేశావ్. నీకు తెలిసిన నిజాన్ని అమ్మ దగ్గర దాచి నీ భార్యని కాపాడావ్. అప్పుడు నేను ఎంత కుమిలిపోయానో నీకేం తెలుసు. చదువుకున్న అమ్మాయి కోడలు అయితే ఇల్లు ముక్కలు అవుతుందని భయాన్ని పక్కన పెట్టి నీ భార్యని వెనకేసుకొచ్చావ్. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు దాచి నీ భార్య మరోసారి మోసం చేసింది. ఎవరో వచ్చి చెప్తే తప్ప ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన సంగతి చెప్పలేదు
Also Read: ఒకరి మీద ఒకరు చిలిపి ఫిర్యాదులు చేసుకున్న వేద, యష్- భ్రమరాంబికని ఆట ఆడుకుంటానన్న మాళవిక
రామా: నువ్వు చేసిన తప్పు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం కాదు ఆ విషయం నాకు చెప్పకపోవడం
జ్ఞానంబ: నువ్వు తాకట్టు పెట్టింది ఇంటి కాగితాలు కాదు భవిష్యత్, నమ్మకం అందుకు ఫలితం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఆరోజు కిందపడి పగిలిపోయింది ఫోటో కాదు నా గుండె.