The Kerala Story Row: ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై సర్వత్రా నిరసనలు, థియేటర్ల దగ్గర భద్రత పెంచిన పోలీసులు
‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కేరళలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్టయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర భద్రత పెంచారు.
తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే మే 5న విడుదల అయ్యింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమా ప్రదర్శన నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్నా, బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కేరళలో పలు సినిమా థియేటర్ల ముందు అధికార, ప్రతిపక్ష నేతలు నిరసనలు చేపట్టారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సినిమా థియేటర్ల దగ్గర భద్రత పెంపు
‘ది కేరళ స్టోరీ’పై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సినిమాను ప్రదర్శించే అన్ని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల దగ్గర భద్రతను పెంచారు. ముఖ్యంగా మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సినిమా చూసిన తర్వాత హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల దగ్గర భద్రతను పెంచాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఏదైనా అభ్యంతరకరమైన కరపత్రాలు, పోస్టర్లు, ఇతర వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సినిమాను ప్రదర్శించే థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించారు. సినిమా హాలులో ఏవైనా అవాంఛిత సంఘటనలు జరిగితే వెంటనే స్పందించాలలని సూచించింది. ప్రేక్షకులకు భద్రత కల్పించేందుకు పోలీసు సహకారం తీసుకోవాలని వెల్లడించింది.
‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?
‘ది కేరళ స్టోరీ’ సినిమాను డైరెక్టర్ సుదీప్తోసేన్ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘ది కేరళ స్టోరీ’పై ప్రధాని ప్రశంసలు
తాజాగా కర్నాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ’ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఉగ్రవాదం, దాని ఆకృత్యాలను ఈ సినిమాలో దర్శకుడు బయటపెట్టారని ఆయన ప్రశంసించారు. అటు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధించాలని అక్కడి అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ట్రైలర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతపరమైన ద్వేషాన్ని సృష్టించేందుకు ఈ సినిమాను తీసినట్లు అర్థం అవుతుందని ఆరోపించారు . రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాయని, వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు.
Read Also: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 35 కోట్లు ఖర్చు - సల్మాన్, షారుఖ్ కాంబో అంటే ఆ మాత్రం ఉండదా మరి!