Mahadev Gaming App: బాలీవుడ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రకంపనలు
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఆషికీ-2 ఫేమ్, బాలీవుడ్ నటీ శ్రద్దాకపూర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఆషికీ-2 ఫేమ్, బాలీవుడ్ నటీ శ్రద్దాకపూర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో, ఇవాళే తమ ముందు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్ , హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రణ్‌బీర్ కపూర్ శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఇండ్రస్ట్రీ లో కొత్త స్కామ్ - సంచలన నిజాలు బయటపెట్టిన బ్రహ్మాజీ!
ఎంత మందిసెలబ్రెటీలు
బాలీవుడ్ నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో వీరు నిందితులు కాదని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే. ఈడీ వీరిని విచారించనున్నట్లు సమాచారం. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.
Also Read : 'లియో'పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు, నిప్పులు చెరుగుతున్న విజయ్ ఫ్యాన్స్!
ప్రమోటర్ పెళ్లి ఖర్చు రూ.200
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహం, ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. పెళ్లి కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హావాలా మార్గంలో నిర్వాహకులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఒక్క హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. మరో నిర్వాహకుడు రవి ఉప్పల్ నిర్వహించిన మరో పార్టీకీ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసింది. ఈ క్రమంలో హవాలా మార్గంలో వచ్చిన సొమ్మున బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈవెంట్ మేజ్‌మెంట్ సంస్థలు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలకూ ఈడీ సమన్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.