Cockroach Telugu Movie: పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
'కాక్రోచ్' సినిమాలో మన సమాజంలోని డార్క్ సైడ్ చూపిస్తున్నామని నిర్మాత బి బాపిరాజు చెప్పారు. మార్చి 6న థియేటర్లలోకి వస్తున్న ఈ రియలెస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీ గురించి ఆయన ఏం చెప్పారంటే?

దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి (P Sunil Kumar Reddy)తో నిర్మాత బి బాపిరాజు అసోసియేషన్ కొన్నేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. పంపిణీదారుడిగా తన ప్రయాణం ప్రారంభించిన బాపిరాజు... ఇప్పుడు నిర్మాతగా రియలిస్టిక్ లో బడ్జెట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. 'సొంత ఊరు', 'గంగపుత్రులు', 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' వంటి సినిమాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కాక్రోచ్'. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన తారాగణం. శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై బి. బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. మార్చి 6న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బి బాపిరాజు ఏం చెప్పారంటే?
- నేను పంపిణీదారుడిగా 70లలో కెరీర్ స్టార్ట్ చేశా. తమిళ సినిమాలు కొని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసేవాళ్లం. ఇప్పుడు ఉన్నట్టు ఓటీటీలు అప్పుడు లేవు కదా, సో డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్ళు. కొన్నాళ్లకు పి. సునీల్ కుమార్ రెడ్డి గారితో పరిచయమైంది. స్వర్గీయ రవీంద్రబాబు గారితో కలిసి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో వరుస సినిమాలు చేశా. అవి మాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
- సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో మరొక వినూత్న సినిమా 'కాక్రోచ్' (Cockroach Telugu Movie). మన సమాజంలో ఎవరూ కావాలని తప్పులు చేయరని... ఆకలి, నిరుద్యోగం, పేదరికం కొందరి చేత తప్పులు చేయిస్తాయని చెప్పే చిత్రమిది.
- ఇప్పుడు మన సమాజంలో వేల కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిన ధనవంతులు ఉంటారు. అటువంటి వాళ్ళలో కొందరు రూపాయి సాయం చేయరు. మరొక వైపు... చేతిలో చిల్లిగవ్వ లేక, పని దొరక్క, విధిలేని పరిస్థితుల్లో యువతరంలో కొంత మంది తప్పుడు దారిలో వెళ్తుంటారు. పొట్ట కూటి కోసం వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తారు కొందరు మహిళలు. అటువంటి కొందరు క్రిమినల్స్, ఓ వేశ్య మధ్య జరిగిన ప్రేమ కథతో తెరకెక్కించిన సినిమా 'కాక్రోచ్'. బోల్డ్‌గా తీశారు సునీల్ కుమార్ రెడ్డి.
- మన సమాచారంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలకు దృశ్య రూపం 'కాక్రోచ్'. తన పేదరికమే శాపం అయ్యి, వ్యభిచార వృత్తిలోకి వచ్చిన ఓ వేశ్య తనకు వచ్చే కొంత డబ్బుతో ఎన్నో బాధలు పడుతుంది. ఆమెకు ఎదురైన అవమానాలు ఏమిటి? ఆ క్రిమినల్స్ ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ధనవంతులను ఒక విధంగా పేదలను మరొక విధంగా చూసే దృశ్యాలు, పేదలకు న్యాయం కూడా దక్కదని చెప్పే సన్నివేశాలను హార్డ్ హిట్టింగ్‌గా చూపించారు సునీల్ కుమార్ రెడ్డి. ఇదొక వయలెంట్ రా అండ్ రస్టిక్ సినిమా.























