Devatha September 12th Update: రాధ గురించి తెలిసి జానకి షాక్- ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిన సత్య
మాధవ్ తన నిజ స్వరూపం బయట పెట్టేసరికి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని రుక్మిణి నిర్ణయం తీసుకుంటుంది. దీంతో కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
జానకి రాధ కోసం వెతుకుతూ పిలుస్తూ ఉంటుంది. కనిపించకపోయేసరికి తన గదిలోకి వెళ్తుంది. అక్కడ బట్టలు సర్ది పెట్టి ఉండటం చూస్తుంది. ఇంట్లో నుంచి బయటకి కూడా అడుగు పెట్టని రాధ బట్టలు సర్దుకుని ఉంది అంటే ఎక్కడికి వెళ్లాలని అని జానకి కంగారుగా బయటకి వచ్చేసరికి రాధ, భాగ్యమ్మ ఇంట్లోకి వస్తారు. ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. మౌనంగా ఉండేసరికి అడుగుతున్నారు కదా చెప్పు బిడ్డా ఇల్లు కూడా చూశాము కదా అని భాగ్యమ్మ అంటుంది. ఇల్లు చూడటం ఏంటి అని జానకి అడుగుతుంది. తల్లి ఈ బిడ్డ తన బిడ్డతో కలిసి బయట ఉండటానికి ఇల్లు చూసి వచ్చాము అని భాగ్యమ్మ చెప్పేసరికి జానకి షాక్ అవుతుంది. ఏంటమ్మా దేవితో బయట ఉంటావా ఉన్నట్టుండి అలాంటి నిర్ణయం తీసుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఎన్ని దినాలు అని కలిసి ఉంటాను అందుకే నా బిడ్డతో కలిసి బయట ఉంటా అని చెప్తుంది అని భాగ్యమ్మ అంటుంది.
'ఏమైంది రాధ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది. నువ్వు ఇంటికి వచ్చిన రోజే నాకు నచ్చితేనే ఉంటాను నచ్చకపోతే వెళ్లిపోతాను అన్న మాట నాకు గుర్తు ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలోచన వచ్చింది అంటే ఏదో అయింది. ఏమైంది చెప్పమ్మా ఈ మధ్య నువ్వు అదోలా ఉన్నప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుందని ఏమైంది చెప్పు' అని మళ్ళీ అడుగుతుంది. పదేళ్ళ తర్వాత వెళ్ళాలి అనిపిస్తుందంటే అది చిన్న విషయం కాదు, ఈ ఇంటితో నీ అనుబంధం నువ్వు వెళ్లిపోతే తెగిపోయేది కాదు, అప్పుడు నువ్వు వచ్చిన రోజు పసి దానికి ప్రాణం పొయ్యడానికి వచ్చిన దానివి. కానీ ఈరోజు నువ్వు ఈ ఊరందరి దృష్టిలో ఈ ఇంటి కోడలివి, పాలిచ్చి ప్రాణం పోసిన ఆ పసిదానికి నువ్వే తల్లివి. అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిందని అడిగితే నేనేం చెప్పాలి అని జానకి అడుగుతుంది.
Also Read: చిత్ర, వైభవ్ ఓవర్ యాక్షన్- కన్నీళ్ళు పెట్టుకున్న వసంత్, వేద, యష్ చిలిపి కొట్లాట
దేవి, చిన్మయిని తీసుకుని ఆదిత్య మాధవ్ ఇంటికి వస్తాడు. మాధవ్ తో మాట్లాడుకుండా వెళ్తుంటే ఏంటి వెళ్తున్నావ్ అని ఆదిత్యని అడుగుతాడు. దేవమ్మ నీ ఇంటికి వచ్చింది నీ సొంతం అయిపోయిందని సంబరపడుతున్నావా అది ఎప్పటికీ జరగదని మాధవ్ అంటాడు. నా బిడ్డని నా అనుమతి లేకుండా తీసుకుని వెళ్లొద్దు అని అన్న తర్వాత కూడా ఎలా తీసుకెళ్తున్నావ్ అని మాధవ్ అంటే.. ఎవరి బిడ్డని తీసుకెళ్లాడానికి ఎవరి అనుమతి కావాలి అని రాధ ఎంట్రీ ఇస్తుంది. మా బిడ్డని నీ బిడ్డ అంటావెంటీ అని రాధ కోపంగా అంటుంది. ఊరంతా అదే అనుకుంటున్నారు అని మాధవ్ అంటాడు. ఊరంతా ఏమనుకున్నా నా మెడలో తాళి కట్టింది నా పెనిమిటి అది మా బిడ్డ అది బయటకి పోవడానికి నీ అనుమతి అవసరం లేదు. అయినా నువ్వు నిలబడి సమాధానం చెప్పడం ఏంటి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని రాధ అంటుంది.
రాధ కోపంగా మాధవ్ వైపు చూస్తూ ఉండటం జానకి బయటకి వచ్చి చూస్తుంది. సత్య ఆదిత్య, దేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆదిత్యకి దేవి అంటే అంత ప్రేమ. కన్న తల్లిని కట్టుకున్న భార్యని చూసినప్పుడు రాని ఆనందం దేవిని చూసినప్పుడు ఎందుకు వస్తుంది. దేవి మా అక్క కూతురు, ఆ మాధవ్ రక్తం. అక్క కూతురు అని కూడా అంతగా అభిమానించాల్సిన అవసరం లేదు కదా. ఆదిత్య దేవిని అభిమానిస్తున్నాడు అంటే మా అక్క కూడా ఎందుకు దేవిని ఆదిత్యకి దగ్గర చెయ్యాలని చూస్తుంది. అంత అవసరం ఏముంది. నా కోసమే కదా చనిపోయినట్టు నమ్మించి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి మంచి కుటుంబం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవి ఆదిత్యతో మాట్లాడితేనే ఒప్పుకోని మాధవ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు. అందరూ మారిపోయారు అని సత్య ఆలోచిస్తూ ఉంటుంది.
Also Read: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్
రాధ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని మనసులో అనుకుంటూ ఉండగా దేవి, చిన్మయి వస్తారు. దేవి సంబరంగా మాట్లాడుతుంది. చిన్మయి మాత్రం బాధగా చూస్తూ ఉంటుంది. అది చూసిన రాధ వెళ్ళి ఏమైందని అడుగుతుంది. ఏమి లేదని చిన్మయి చెప్తుంది. రేపటి నుంచి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి, అన్నీ నేర్పించాను కదా బాగా చదువుకోవాలి అని చెప్తుంది.