Devatha July 23 Update: ఆదిత్యపై సత్య అనుమానం, రుక్మిణి దగ్గరకి వచ్చి ఆరా- మాధవని వదిలిపెట్టేదె లేదంటున్న ఆదిత్య
దేవి కన్న తండ్రి గురించి మాధవ కొత్త కథ అల్లి ఆదిత్యకి దగ్గర కానివ్వకుండా చేస్తాడు. దీంతో రుక్మిణి అల్లాడిపోతుంది. దేవి రోజు రోజుకి కన్నతండ్రి మీద పగ పెంచుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
సత్య రాధ దగ్గరకి వస్తుంది. ఆదిత్య గురించి నీతో మాట్లాడటానికి నీకోసమే వచ్చానని చెప్తుంది. నీ పెనిమిటి గురించి నాతో మాట్లాడటానికి ఏముందని రాధ అంటుంది. 'చెస్ పోటీల్లో దేవిని గెలిపించేందుకు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డాడు. కానీ దేవి గెలిచిందన్న ఆనందం ఆదిత్య మొహంలో కనిపించడం లేదు. పోటీల్లో గెలిచిందని సంతోషంగా ఫోన్ చేశాడు. కాని ఇంటికి వచ్చిన తర్వాత మొహంలో ఆ ఆనందం కనిపించలేదు.. అందుకే నిన్ను అడిగి వెళ్దామని వచ్చాను. చెస్ పోటీలకి నువ్వు కూడా వెళ్ళి ఉంటావ్ కదా అక్కడ ఏమైనా జరిగిందా' అని సత్య ప్రశ్నిస్తుంది. దేవి ఆదిత్య బాధపడేలాగా ఏమైనా అన్నదా? లేక బావగారు ఆదిత్యతో ఏమైనా గొడవ పడ్డాడా? అని అడుగుతుంది. అక్కడ ఏమి జరగలేదు ఆయన దేనికి బాధపడుతున్నారో నాకు తెలియదని రాధ చెప్పడంతో సత్య అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతుంది.
Also Read: జానకి గురించి నిజం తెలుసుకున్న గోవిందరాజులు- సర్టిఫికెట్స్ తెచ్చేందుకు ప్లాన్ వేసిన గోవిందరాజులు
'నీ బతుకు బాగుండాలి పెనిమిటి నువ్వు సంతోషంగా ఉండాలని ఈ ఇంట్లో మాధవ సారు ఎన్ని బాధలు పెట్టిన భరిస్తున్నా. గా పొద్దు ఏం జరిగిందో పెనిమిటికే తెలియదు. ఇంక నీకేం చెప్తాడు. నేను ఐతే ఏ పొద్దు నీకు పెనిమిటికి మధ్య రాను. మీ కోసం ఏమైనా చేస్తాను కానీ నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు' అని కన్నీరు పెట్టుకుంటుంది. దేవి చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచినందుకు అభినందించడానికి కొంతమంది మాధవ ఇంటికి వస్తారు. వాళ్ళని కావాలనే మాధవ రప్పించినట్టుగా ఉంటుంది. మీ ఇద్దరికీ బంగారం లాంటి బిడ్డ పుట్టిందమ్మా అని వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అంటుంది. ఆ మాటకి రాధ కోపంగా చూస్తుంది. స్కూల్ కి ఊరికి మంచి పేరు తీసుకొచ్చిందని దేవిని సన్మానిస్తారు. రాధ దిగులుగా ఉండటం చూసి దేవి బాధపడుతుంది. 'నాదగ్గర ఇంక దాస్తావ్ ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను పెద్దయ్యాక ఏ కష్టం రాకుండా చూసుకుంటా, కలెక్టర్ అయ్యాక నిన్ను మంచిగా కారులో ఎక్కించుకుని తిప్పుతాను' అని దేవి అనడంతో రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది. నువ్వు అందరినీ మంచిగా చూసుకుంటావ్ కదా మరి నాయన నిన్ను ఎందుకు తిట్టేవాడు, కొట్టేవాడు అని దేవి అడుగుతుంది. ఆ మాటకి రుక్మిణి మౌనంగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. మీ నాయన చాలా మంచోడు నువ్వు నేను అంటే ప్రాణం అని రుక్మిణి మనసులోనే అల్లాడిపోతుంది.
Also Read: కన్నతండ్రి మీద పగతో రగిలిపోతున్న దేవి- గుండెలవిసేలా ఏడుస్తున్న రుక్మిణి, సత్య మీద అరిచిన ఆదిత్య
'ఆ రోజు ఇంట్లో నుంచి బయటకి వచ్చేటప్పుడు నా చెల్లి గురించి ఆలోచించనే కానీ కడుపులో ఉన్న నీ గురించి ఆలోచించలేదు. మీ నాయనకి నిన్ను దూరం చేస్తున్నానని అనుకోలేదు. నీ బతుకు ఆగం పట్టిస్తున్నా' అని అనుకోలేదని ఏడుస్తుంది. ఇక ఆదిత్య మళ్ళీ రుక్మిణికి ఫోన్ ట్రై చేస్తాడు. 'ఎందుకు రుక్మిణి ఫోన్ తియ్యడం లేదు, ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తాడు. ఎన్ని సార్లు చేసిన తియ్యడం లేదంటే ఆ మాధవ అడ్డుపడుతున్నాడా, రుక్మిణి ఫోన్ తియ్యకపోవడానికి వాడే కారణం అని తెలియాలి ఈరోజు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసలు ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుంటాను ఇంకోసారి రుక్మిణి జోలికి రాకుండా బుద్ధి చెప్తాను' అని ఆదిత్య అనుకుంటాడు. స్కూల్ దగ్గర ఒక పిల్లని తన తండ్రి ప్రేమగా దగ్గరకి తీసుకోవడం చూసి దేవి బాధపడుతుంది. అందరూ నాయనలు మంచిగా ఉన్నారు, మరి మా నాయన ఎందుకు గట్ల ఉన్నాడు. మాయమ్మని తిట్టాడు కొట్టాడు, నేను పుట్టినాక నన్ను చూడటానికి ఎందుకు రాలేదు. నాయన ఏదో ఒక రోజు నువ్వు నాకు అగుపిస్తావ్ అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా అనుకుంటుంది. స్కూల్ దగ్గర దేవి వాళ్ళ కోసం భాగ్యమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. దేవి దిగులుగా ఉండటం చూసి చిన్మయి ఏమైంది ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది కానీ దేవి మౌనంగా ఉంటుంది.