Devara 3: ఎన్టీఆర్ ‘దేవర‘కు పార్ట్ 3 ఉంటుందా? అసలు విషయం చెప్పేసిన కొరటాల శివ
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర‘ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని మేకర్స్ తొలి నుంచే చెప్పారు. తాజాగా ‘దేవర 3‘ గురించి కొరటాల కీలక విషయాలు వెల్లడించారు.
Koratala Siva About Devara 3 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర‘. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు. ‘దేవర’ తొలి భాగం హిట్ కావడంతో ‘దేవర 2’పై కొరటాల ఫోకస్ పెట్టారు.
‘దేవర 3’పై కొరటాల కీలక వ్యాఖ్యలు
‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి ‘దేవర 2’పై పడింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ముందుగా చెప్పినట్లుగానే రెండో భాగం తప్పకుండా వస్తుంది. తాజాగా ‘దేవర 3’ కూడా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. తాను ‘దేవర 3’ గురించి అస్సలు ఆలోచించలేదన్నారు. ఈ సినిమాను ప్రాంచైజీగా మార్చాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదన్నారు. “నేను ‘దేవర’ సినిమాను ప్రాంచైజీగా మార్చాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను ఒక కథను ఒక మూవీలో చెప్పాలి అనుకున్నాను. కానీ, ‘దేవర’ సినిమాలోని కొన్ని క్రిటికల్ క్యారెక్టర్ల కారణంగా ఒకే సినిమాలో ఈ కథ చెప్పడం సాధ్యం కాదు అనుకున్నాను. అందుకే, రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. మూడో భాగానికి సంబంధించిన ఆలోచన లేదు. చేయం కూడా” అని కొరటాల చెప్పుకొచ్చారు.
ఇప్పటికే ‘దేవర 2’ సన్నివేశాలు షూట్
ఇక ‘దేవర 2’ సినిమా గురించి కొరటాల శివ కీలక విషయాలు వెల్లడించారు. ‘దేవర’ సీక్వెల్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. మిగిలిన సన్నివేశాలు కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎప్పుడు అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు.
వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీ
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ షూట్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘వార్’ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అటు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ ‘దేవర 2’ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది..
Also Read : హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత , అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్