Yamadheera: ఇది 'సింగం' సీక్వెల్ కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ మీద తీసిన సినిమా
క్రికెటర్ శ్రీశాంత్ విలన్ రోల్ చేసిన కన్నడ సినిమా 'కెంపెగౌడ 2'. తెలుగులో ఈ వారమే విడుదల కానుంది.
కోలీవుడ్ స్టార్ సూర్య శివ కుమార్ హీరోగా నటించిన 'సింగం' సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. 'సింగం' చిత్రాన్ని కన్నడలో 'కెంపెగౌడ'గా సుదీప్ రీమేక్ చేశారు. అది 2011లో విడుదలైంది. ఏడేళ్ల తర్వాత 'కెంపెగౌడ 2' పేరుతో మరో సినిమా వచ్చింది. హీరోతో పాటు దర్శక నిర్మాతలు మారారు. అయితే, ఇది 'సింగం' సీక్వెల్ కాదు. పూర్తిగా కొత్త కథతో తెరకెక్కించిన సినిమా. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో డబ్ చేశారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మార్చి 23న తెలుగులో 'యమధీర' విడుదల
కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన డబ్బింగ్ సినిమా 'యమధీర'. ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేశారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ పతాకంపై వేదాల శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ వంటి తెలుగు ఆర్టిస్టులు నటించిన చిత్రమిది. ఈ నెల 23న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి.ఎస్. రావు, పి. శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: 'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా
టైటిల్ క్యాచీగా ఉంది - ప్రసన్నకుమార్
'యమధీర' టైటిల్ క్యాచీగా ఉందని ప్రసన్న కుమార్ అన్నారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్ నటించడంతో తెలుగు సినిమాలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ... ''తెలుగులో యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అదే విధంగా ధీర... 'మగధీర' బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా ఆయా సినిమాల తరహాలో విజయం సాధించాలి. కోమల్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు. విజయ్ 'సర్కార్' ఈ తరహా కథతో వచ్చి విజయం సాధించింది. ఈవీఎం ట్యాంపరింగ్, పోలింగ్ వంటి అంశాలను 'యమధీర' సినిమాలో బాగా చూపించారు. నిర్మాతగా వేదాల శ్రీనివాస్ భారీ లాభాలు అందుకోవడంతో పాటు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి'' అని చెప్పారు.
నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... ''నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలకు థాంక్స్. ఈవీఎం ట్యాంపరింగ్ మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని, పోలీస్ నేపథ్యంలో 'యమధీర' తీశాం. అజర్ బైజాన్ దేశంలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగింది. కన్నడలో 100కు పైగా సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నెల 23న ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు.
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీ మందిరం ప్రొడక్షన్స్, ఛాయాగ్రహణం: రోష్ మోహన్ కార్తీక్, మాటలు - పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర, కూర్పు: సి రవిచంద్రన్, సంగీతం: వరుణ్ ఉన్ని, నిర్మాత: వేదాల శ్రీనివాస్ రావు, కథ - దర్శకత్వం: శంకర్ ఆర్.