Varun Sandesh: వరుణ్ సందేశ్ కాలికి గాయమైనా... దర్శకుడి కోసం రిస్క్ తీసుకుని 'నింద' సెట్స్‌కు!
Varun Sandesh Interview: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'నింద' ఈ నెల (జూన్) 21న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు తన గాయం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.
Varun Sandesh On Ninda Movie: ''వరుసగా రొటీన్ సినిమాలు చేస్తుండటంతో నాకే బోర్ కొట్టింది. ఇటువంటి సినిమాలు చేస్తున్నానేంటి? అని ప్రశ్నించుకున్నా. నేను కాస్త విరామం తీసుకోవాలని అమెరికా వెళ్లాను. ఆ సమయంలో 'నింద' కథ చెప్పారు రాజేష్. విన్న వెంటనే సినిమా చేద్దామని చెప్పాను'' అని వరుణ్ సందేశ్ తెలిపారు.
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రాజేష్ జగన్నాధం నిర్మించిన సినిమా 'నింద'. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల (జూన్) 21న థియేటర్లలోకి వస్తోంది. నైజాంలో మైత్రీ మూవీస్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఈ తరుణంలో సినిమా విశేషాలతో పాటు తన కాలికి అయిన గాయం గురించి వరుణ్ సందేశ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
నిజ జీవితంలో నాకు, 'నింద'లో పాత్రకు పోలికే లేదు!
Varun Sandesh Role In Ninda Movie: ''నేను చిల్ పర్సన్. నిజ జీవితంలో జాలీగా ఉంటా. సీరియస్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదు. నాకు, 'నింద'లో పోషించిన పాత్రకు అసలు పోలిక లేదు. నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశా. సెటిల్డ్, మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ చూస్తారు. ఇందులో నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసర్ రోల్ చేశా. ఒక మర్డర్ కేసును అతడు ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేది సినిమా''.
కథపై నమ్మకడంతో దర్శకుడే నిర్మాతగా సినిమా చేశారు
''నేను కథ విన్నప్పుడు నిర్మాత ఎవరనేది ఆలోచించలేదు. కథ నచ్చడంతో ఓకే చెప్పేశా. ఆ కథను రాజేష్ చెప్పిన విధానం మరింత నచ్చింది. ఆయన సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసి మరింత సంతోషించా. కథపై నమ్మకంతో అతనే నిర్మించడానికి ముందుకొచ్చారు. సినిమా పూర్తి అయ్యేసరికి నాకు బ్రదర్ అయిపోయారు. ఇటువంటి థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఎంతో ముఖ్యం. సంగీత దర్శకుడు సాంతు ఓంకార్, ఛాయాగ్రాకుడు రమీజ్ వర్క్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మంచి టీమ్ సెట్ చేశారు రాజేష్''.
కాలికి గాయమైనా 'నింద' చేశా... ఒక్కడి కోసం వేస్ట్ ఎందుకు?
''ఈ సినిమా షెడ్యూల్ ఒకటి ప్రారంభించడానికి ముందు 'కానిస్టేబుల్' చేశా. ఆ చిత్రీకరణలో నా కాలికి గాయం అయ్యింది. ఆ వెంటనే 'నింద' షెడ్యూల్... ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. నా ఒక్కడి వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయడం అంటే మనసు ఒప్పుకోలేదు. రాజేష్ గారి అంకితభావం, సినిమాపై ప్రేమ చూసి గాయమైన కాలితో చిత్రీకరణ చేశా. రాజేష్ కోసం రిస్క్ తీసుకున్నా''
''సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్... ఈ మూడు అంశాల కలయికలో మనకు పలు సినిమాలు వచ్చాయి. అయితే, 'నింద' స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. వాట్ నెక్ట్స్? అనేది ఎవరూ చెప్పలేరు. నటీనటులకు కూడా దర్శకుడు కథను పూర్తిగా చెప్పలేదు. సో, చిత్రీకరణ చేసేటప్పుడు ఆసక్తి పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరో వాళ్లకు తెలియదు కనుక సహజంగా నటించారు. రాజేష్ స్నేహితుడు అమెరికాలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారి ఫ్రెండ్. ఆయన చెప్పడంతో మైత్రీ శశి గారు సినిమా చూశారు. నచ్చడంతో విడుదల చేస్తున్నారు''.
వరుణ్ సందేశ్ చేతిలో ఉన్న సినిమాలు!
Varun Sandesh Upcoming Movies: ''నింద' తర్వాత మరొక సినిమా చేశా. అదొక క్రేజీ ప్రాజెక్ట్! ఈ సినిమాలో పాత్రకు, అందులో చేసిన పాత్రకు అసలు సంబంధం లేదు. పోలికలు ఉండవు. జూలైలో కొత్త సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. 'కానిస్టేబుల్' అని మరొక సినిమా చేస్తున్నా''.
Also Read: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్