Flood Relief Fund: హీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?
తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రజలకు అండగా మేమున్నామంటూ హీరోలు ముందడుగు వేశారు. విరాళాలు వెల్లడిస్తున్నారు. మరి, హీరోయిన్లు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు. రాష్ట్రాలను వేర్వేరుగా చూడలేదు. ప్రజలూ అంతే... హీరో హీరోయిన్లు అభిమానించారు తప్ప రాష్ట్రాల వారీగా బేరీజు వేసి వేరు చేసి చూసింది లేదు. ఇప్పుడు ఆ ప్రజలు కష్టాల్లో ఉంటే హీరోలు ముందుకొచ్చారు. కోట్లలో విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మరి, హీరోయిన్లు ఎక్కడ? అందాల భామలు ఎందుకు నోరు ఎందుకు మెదపడం లేదు? పర్సులో నుంచి రూపాయి ఎందుకు బయటకు తీయడం లేదు?
కోట్లలో కాదు... లక్షల్లోనూ విరాళం ఇవ్వలేరా?
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు... ఒక్కొక్కరూ కోటి కోటి చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చారు. త్రివిక్రమ్, చినబాబు, నాగవంశీ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి తమ వంతు సాయంగా లక్షలు ఇచ్చారు. ఈ లిస్టులో మరికొందరు హీరోలు చేరే అవకాశం ఉంది. ఇవాళో రేపో అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఏపీ, తెలంగాణలో ఇంత బీభత్సం జరుగుతున్నా హీరోయిన్లు ఒక్కరు కూడా స్పందించడం లేదు.
సమంత, రష్మిక మందన్నా, తమన్నా భాటియా, పూజా హెగ్డే, కీర్తీ సురేష్, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా నుంచి మొదలు పెడితే ఇటీవల శ్రీ లీల, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి వంటి హీరోయిన్లు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని వెనకేసుకున్నారు. వాళ్లకు అంత ఫేమ్, నేమ్, పైసల్ రావడానికి కారణం ఎవరు? తెలుగు ప్రేక్షకులే కదా! అటువంటి తెలుగు రాష్ట్రాలు వర్షాలు, వరదలతో కష్ట కాలంలో ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రూపాయి బయటకు తీయలేదు.
అనన్య, స్రవంతిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి
స్టార్ హీరోయిన్లు అందరూ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్ అనన్యా నాగళ్ళ, యాంకర్ స్రవంతి చొక్కారపును చూసి సిగ్గు తెచ్చుకోవాలనే కామెంట్లు జనాల నుంచి వినపడుతున్నాయి. ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు విరాళంగా ఇచ్చారు అనన్య. యాంకర్ స్రవంతి రెండు రాష్ట్రాలకు లక్ష ఇచ్చారు.
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…
— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024
In the light of recent devastation caused by massive floods in AP & Telangana. I would like to extend my support by donating 1L Rupees to the @AndhraPradeshCM & @TelanganaCMO Relief Funds. May the people of Telugu states recover soon!@revanth_anumula @ncbn @PawanKalyan
— Sravanthi chokarapu (@urs_sravanthi) September 3, 2024
నిజానికి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఒక్కో సినిమాకు అనన్య తీసుకునే అమౌంట్ చాలా తక్కువ. ఆమె చేసిన సినిమాలూ 20 లోపే. కానీ, తెలుగు ప్రజలకు తన వంతు సాయంగా ఐదు లక్షల విరాళం ప్రకటించారు. యాంకర్లకు ఒక ఈవెంట్ చేస్తే వచ్చే అమౌంట్ లక్ష కంటే తక్కువ. కానీ, స్రవంతి లక్ష ఇవ్వడానికి అసలు ఆలోచించలేదు. కోట్లకు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు లక్ష తీయడానికి ఆలోచిస్తున్నారంటే ఏమనాలి? వాళ్లకు బాధ్యత ఉండక్కర్లా?
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లేదంటే శారీ స్టోర్స్ ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు హీరోలను చూశారా? పొరపాటున కూడా కనిపించరు. హీరోలను పిలవడం చాలా అరుదు. హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్లను చూడటానికి జనాలు సైతం ఎగబడతారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ అని కాదు... చిన్న చిన్న పట్టణాల్లో షాప్ ఓపెనింగ్స్‌కు హీరోయిన్లు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. ఒక్కో షాప్ ఓపెనింగ్ లేదా మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కంటే మినిమమ్ ఐదు, పది లక్షలు లేనిదే స్టార్ హీరోయిన్లు అడుగు బయట పెట్టరు. ఫ్లైట్ టికెట్స్, స్పెషల్ కార్, హోటల్ రూమ్ వంటివి అదనం. ఇప్పుడు ఆ అందాల భామలు ఎక్కడ? ఒక్క షాప్ ఓపెనింగ్ డబ్బులు బయటకు తీయలేరా? హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తక్కువ కావచ్చు. కోట్లలో కాకున్నా కనీసం లక్ష ఇవ్వలేరా? తనకు పేరు, డబ్బులు రావడానికి కారణమైన ప్రజల కోసం ఆమాత్రం చేయలేరా?