Ticket Rates Commite : ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !
సినిమా టిక్కెట్లపై హైకోర్టు సూచనలతో ఏర్పాటు చేసిన కమిటీ తొలిసమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరో వారంలో మరోసారి సమావేశం అవుదామని అధికారులు చెప్పి సమావేశాన్ని ముగించారు.
హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసేందుకు నియమించిన కమిటీ తొలి సమావేశంలో పెద్దగా చర్చ జరగకుండానే వాయిదా పడింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ నియమించింది. ఇందులో ప్రభుత్వంతో పాటు ఫిలించాంబర్ ప్రతినిధులు కూడా ఉన్నారు. కరోనా కారణంగా జూమ్ ద్వారా మొదటి భేటీని నిర్వహించారు. కమిటీలోని టాలీవుడ్ ప్రతినిధులు తదితరులు జూమ్ ద్వారా సమస్యలను వివరించారు. టిక్కెట్ ధరలపైనే ప్రధానంగా అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీ క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.5గా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీ క్లాస్ సెంటర్లలో టిక్కెట్ రేట్లు తగ్గించడంవల్ల థియేటర్లు మూతపడుతున్నాయని, ఇది సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళనకరమైన అంశమని అన్నారు. కరెంట్ ఖర్చులు కూడా రావని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు కరెంట్ బిల్లులు, జీఎస్టీ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు భరించలేకనే.. 11 జిల్లాల్లో థియేటర్లు మూసివేశారని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రతినిధులు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని సమాచారం. మరో వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని.. అప్పుడు సమావేశానికి పూర్తి ప్రతిపాదనలతో రావాలని అధికారులు సూచించి సమావేశాన్ని ముగించారు.
Also Read: ఇంద్ర భవనం కాదు మోహన్ బాబు ఇల్లు.. మంచు లక్ష్మి హోమ్ టూర్ వీడియో వైరల్
సమస్యలు పరిష్కరించేందుకు, టికెట్ ధరలను పునఃసమీక్షించేందుకే.. కమిటీ ఏర్పాటు చేశామని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. మరో వారానికి సమావేశం వాయిదా పడటంతో వచ్చే వారం విడుదల కావాల్సి ఉన్న ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న ధరలతోనే కలెక్షన్లను సాధించాలి. ఇప్పటికే అనేక ధియేటర్లను మూసేశారు. ఒక వేళ తెరిచినా అనుకున్నంత కలెక్షన్లు రావని భావిస్తున్నారు.
Also Read: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి