Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?

ఇవాళ భారతీయ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. తెలుగు సినిమా తన పరిధిని పెంచుకుని పాన్ ఇండియా సినిమాల వైపు అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో తెలుగు, తమిళ హీరోల మధ్య కంపేరిజన్ కూడా వస్తోంది.

FOLLOW US: 

తెలుగు హీరో సోగ్గాడు...
తెలుగు హీరో అందగాడు...
తెలుగు హీరో శ్రీమంతుడు...
తెలుగు హీరో ధీరుడు... శూరుడు!
మరి, మనలో ఒకడిగా... 
సామాన్యుడిగా చూడలేమా?
అది అసాధ్యమా? సుదూరమా?
తెలుగు హీరోల్లో మార్పు రాదా?

తమిళ హీరో సూర్య నటించిన 'జై భీమ్' ఓటీటీలో విడుదల కావడంతో ఎక్కువ మంది చూశారు. విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. 'జై భీమ్'లో హీరో సూర్య న్యాయవాదిగా నటించారు. పీడిత పక్షాలు, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుని జైళ్లల్లో మగ్గుతున్న నిమ్న వర్ణాల ప్రజల తరఫున పోరాడే న్యాయవాది పాత్ర. కథ, కథా నేపథ్యం పక్కన పెడితే... 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషించిన పాత్రకు, 'జై భీమ్'లో సూర్య పాత్రకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రెండూ న్యాయవాది పాత్రలే. ఇద్దరూ సామాన్యులకు అండగా పోరాడిన న్యాయవాదులే. అయితే... రెండు పాత్రల మధ్య ఎంత తేడా? సూర్య పాత్రను సాదాసీదా ఉంటే... పవన్ కల్యాణ్ పాత్ర కమర్షియల్ హంగులతో ఉంటుంది. డ్రస్సింగ్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకూ! సూర్య క్యారెక్టర్ అండర్ ప్లే చేస్తుంది. పవన్ కల్యాణ్ బ్రాండెడ్ దుస్తుల్లో కనిపించారు. సినిమాలో పవనిజం ఎక్కువ కనిపించింది. 'వకీల్ సాబ్'లో పవన్, 'జై భీమ్'లో సూర్య పాత్రల మధ్య ఈ తేడాలను ఎత్తిచూపుతూ కొంతమంది సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
 తెలుగు సినిమాలు కమర్షియాలిటీకి దగ్గరగా, రియాలిటీగా దూరంగా ఉంటాయనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. తెరపై తెలుగు హీరో ఎప్పుడూ సోగ్గాడిగా, అందంగా, శ్రీమంతుడిగా, ధీరుడిగా మాత్రమే కనిపిస్తాడనేది మరో ఆరోపణ. అయితే... తెలుగు హీరోలు డీ-గ్లామర్ రోల్స్ చేయలేదా? అని ప్రశ్నించుకుంటే 'చేశారు' అనే సమాధానం వస్తుంది. కానీ, అరుదుగా మాత్రమే తెలుగు హీరోలు డీ-గ్లామర్ రోల్స్‌లో కనిపించారు.
Also Read: Tollywood2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
 ఒక్కసారి గతంలోకి వెళితే... 'భైరవ ద్వీపం'లో బాలకృష్ణ లుక్ పరంగా ప్రయోగం చేశారు. నాగార్జున 'గీతాంజలి', 'గగనం' వంటి సినిమాలు చేశారు. 'స్వయంకృషి'లో చిరంజీవి చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించారు. ధనుష్ 'అసురన్'ను 'నారప్ప'గా రీమేక్ చేసిన వెంకటేష్... గతంలో ప్రయోగాత్మక చిత్రాలు కొన్ని చేశారు. ఇప్పుడు 'పుష్ప'లో అల్లు అర్జున్ రూరల్ మాస్ రోల్ చేశారు.
 ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విషయానికి వస్తే... 'జానీ'లో అందంగా ఏమీ కనిపించలేదు. బక్కచిక్కిన బాడీతో బారాబర్ అండర్ ప్లే చేసే రోల్ చేశారు. అయితే, ఆ సినిమా విజయం సాధించలేదు. ప్లాప్ అయ్యింది. దాంతో లుక్స్ పరంగా మళ్లీ ప్రయోగాల జోలికి వెళ్లలేదు పవన్. కథల పరంగా కూడా! ఎటువంటి నేపథ్యంలో కథ ఎంపిక చేసుకున్నా... అభిమానులు ఆశించే ఫైట్స్, సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే కాదు... మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్ ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరిదీ ఇదే బాట. అందరి ముందున్నదీ ఒక్కటే ప్రశ్న... ఇమేజ్ సంకెళ్లను తెంచుకుని ఎలా బయటకు రావాలి.
 '1: నేనొక్కడినే', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి'... ఈమధ్య కాలంలో మహేష్ బాబు ప్రతి  హ్యాండ్సమ్‌గా కనిపించారు. దాంతో మహేష్ రిచ్ కిడ్ రోల్స్ తప్ప నార్మల్ రోల్స్ చేయడనే ముద్ర పడింది. అందంగా కనిపించడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కొంతమంది విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. అయితే... 'ఒక్కడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత 'నిజం' చేసిన మహేష్ బాబును మర్చిపోకూడదు. 'నిజం' ఆశించిన విజయం సాధించలేదు. లుక్స్ పరంగా మళ్లీ హ్యాండ్సమ్ బార్ కంటే కిందకు దిగే ప్రయత్నం మహేష్ చెయ్యలేదు.
 'అల... వైకుంఠపురములో' అల్లు అర్జున్‌ది గుమస్తా కుమారుడి క్యారెక్టర్. కానీ, బ్రాండెడ్ దుస్తుల్లో కనిపిస్తారు. బహుశా... ఎవరైనా క్వశ్చన్ చేస్తారని దర్శకుడు త్రివిక్రమ్ ముందే ఊహించారేమో!? ఓ సన్నివేశం రాశారు... తండ్రి కొత్త డ్రస్సులు కొనకుండా అతను పనిచేసే ఇంట్లో అబ్బాయిగారు వాడిన డ్రస్సులు తీసుకొస్తున్నట్టు! దాంతో సినిమా అంతా అల్లు అర్జున్ స్టయిలిష్‌గా కనిపించారు. అయితే... అంతకు ముందు సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో లుక్ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. ఆ ఆ క్యారెక్టర్, సినిమాకు పేరొచ్చింది కానీ ఫలితం రాలేదు. 'అరణ్య'లో రానా దగ్గుబాటి అడవి, అడవిలో ఏనుగుల కోసం తపించే పాత్ర చేశారు. 'నేనింతే'లో రవితేజ విలన్ చేత ఓ సన్నివేశంలో ముఖం మీద ఉమ్ము వేయించుకున్నారు. తెలుగు హీరోలు కాస్త కొత్తగా ప్రయత్నించిన సమయాల్లో ఎక్కువశాతం ఆశించిన విజయాలు దక్కలేదు.
 ఇమేజ్ ఛట్రం నుంచి బయటకు రావడానికి కష్టపడుతున్నాడు. కామెడీ ఇమేజ్ నుంచి బయట పడటం కోసం 'అల్లరి' నరేష్ పెద్ద యుద్ధమే చేశారు. 'సుడిగాడు' తర్వాత చాలా రోజులు ఆయనకు సరైన హిట్ పడలేదు. 'లడ్డూబాబు', 'బందిపోటు' పరాజయాల్ని అందించాయి. కామెడీ క్యారెక్టర్ల తర్వాత 'మహర్షి', 'నాంది'లో ఇంటెన్స్ రోల్స్ అల్లరోడిలో నటుణ్ణి మరోసారి బయటకు తీసుకొచ్చాయి. విజయాల్ని అందించాయి. 'నాంది'లో నరేష్ కామెడీ చేయలేదు. కానీ, ప్రేక్షకులకు సినిమా నచ్చింది. ప్లాప్ వచ్చిందని ప్రయోగాల జోలికి వెళ్లడం మానేయకుండా... ప్లాప్ ఎందుకు వచ్చింది? ఎక్కడ తప్పు జరిగింది? అని విశ్లేషించుకుని విజయం కోసం మరో ప్రయత్నం చేయడం వీరుడి లక్షణం.
 ఒక్క ప్లాప్ వచ్చిందని కొత్తగా ప్రయత్నించకపోవడం ఎంతవరకూ కరెక్ట్? ఒక్క సినిమా ఫలితం తేడా కొట్టిందని కొత్త కథలకు దూరంగా ఉండటం ఎంతవరకూ సమంజసం? విమర్శకుల వాదనలోనూ కొంత నిజం లేకపోలేదు. తెలుగు సినిమా కమర్షియల్ బాటలో వెళుతోంది. మెజారిటీ ప్రేక్షకులను మెప్పించే ఫార్ములా పట్టుకుంది. తెలుగు హీరో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.
 'జై భీమ్' చేసిన సూర్య, 'సింగమ్' లాంటి మాస్ సినిమాలు చేశారు. 'సికిందర్' (తమిళంలో 'అంజాన్') లాంటి స్టయిలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు. మధ్యలో 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' వంటి సినిమాలూ చేస్తున్నారు. విజయ్, విక్రమ్, అజిత్, కార్తీ లాంటి హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. తెలుగు సినిమాలను అనుసరిస్తున్నారు. అయితే... తమిళ హీరో చేసినన్ని ప్రయోగాలు తెలుగు హీరో చేయడం లేదు.
సూర్య సినిమాను పొగుడుతూ... తెలుగు సినిమాను తిట్టాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. అసలు ఈ సినిమా... ఎప్పుడో ౩౦ ఏళ్ల క్రితం వచ్చిన 'అంకురం'కు దగ్గరగా ఉందనేవాళ్లూ లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి 'స్వయంకృషి'లో చెప్పులు కుట్టే సాంబయ్యగా... 'ఆపద్భాందవుడు'లో పశువుల కాపరిగా... 'జననీ జన్మభూమి'లో బాలకృష్ణ గూడెంలో జనాలను బాగుచేసే సంస్కర్తగా...  'జైత్రయాత్ర'లో నాగార్జున ఆదర్శవాదిగా కనిపించలేదా? అంటున్నారు. అవన్నీ పాతికేళ్ల కిందటివి. ఇప్పటి పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న!
 అసలు టాపిక్ అటువంటి సినిమాలు వచ్చాయా? లేదా? అని కాదు. మన హీరోలు ఎంత వరకూ సిద్ధంగా ఉన్నారు? అని! 'అసురన్', 'కర్ణన్' సినిమాల్లో ధ‌నుష్‌లా మాసిపోయిన గెడ్డం, నలిగిపోయిన చొక్కాలతో నటించడానికి మన హీరోలు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి బదులుగా 'రంగస్థలం' సినిమాను కొంతమంది చూపించవచ్చు. అది పల్లెటూరి నేపథ్యంలో తీసిన భారీ కమర్షియల్ సినిమా. దానిని 'అసురన్'తో పోల్చలేం. కొంత మంది 'పుష్ప'ను చూపించవచ్చు. అదీ కమర్షియల్ చిత్రమే. పల్లెటూరి నేపథ్యంలో కథతో భారీ కమర్షియల్ సినిమా తీయడం వేరు, అణగారిన వర్గాల సమస్యలను సినిమాలో చర్చించడం వేరు. తెలుగులో ఒకటీ అరా అటువంటి సినిమాలు వచ్చినా... కొంత మంది ప్రయత్నాలు చేసినా... తమిళ ఇండస్ట్రీతో పోలిస్తే, తెలుగులో అటువంటి సినిమాలు తక్కువ. బాలా, పా. రంజిత్, వెట్రిమారన్, జ్ఞానవేల్ లాంటి వాళ్లు చాలా సున్నితమైన సమస్యలను కమర్షియల్‌ ఫార్మాట్‌లో తీసుకెళుతున్నారు. ఒక విభిన్న కథాంశం పేరుతో వైవిధ్యమైన నేపథ్యం ఎంచుకోకుండా... నిజాయతీగా సమస్యలను చర్చించే ప్రయత్నం చేయాలి. 'జై భీమ్‌'లో అదే జరిగింది. అణచివేత ఇంత దారుణంగా ఉంటుందా? అని! సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయేలా ఉంది. అటువంటి సినిమా ఎక్కువ కాలం నిలబడుతుంది. 'జై భీమ్' అనేది ఒక రివెంజ్ డ్రామా కాదు, అణచివేసిన వాళ్లపై నేరుగా చేసిన తిరుగుబాటు కాదు, ఒక వ్యవస్థపై సంధించిన అస్త్రం. చట్ట పరిధిలో హింస లేకుండా ఎలా ఎదుర్కోవాలో చూపించిన చిత్రం. అటువంటి సినిమా చేయడానికి నిజాయతీ కావాలి. 
 ఇప్పుడు తెలుగు సినిమా మీద ప్రేక్షకులందరి చూపు ఉంది. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదుగుతోంది. 'బాహుబలి' తర్వాత హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మన మట్టి కథల్ని వెండితెరపై ఆవిష్కరించడం చాలా ముఖ్యం. తమిళ సినిమాల్లో నేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుగు సినిమా మన మట్టి వాసన ఎప్పుడు పీలుస్తుందో? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసేటప్పుడు ప్రయోగాలు చేయలేమనేది కొంతమంది పరిశ్రమ ప్రముఖుల నుంచి వినిపించే మాట. 'రంగస్థలం'లో రామ్ చరణ్, 'శ్రీదేవి సోడా సెంటర్'లో సుధీర్ బాబు, 'పలాస'లో రక్షిత్, 'కలర్ ఫొటో'లో సుహాస్... డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్లు చేశారు. ఆ సినిమాలకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు వచ్చాయి కదా!  తమిళ సినిమాలకు ధీటుగా తెలుగులోనూ సినిమాలు వస్తాయని నిరూపించాయి కదా! ఇలా చెబుతూ వెళితే కొన్నే కనిపిస్తాయి. లార్జర్ దేన్ లైఫ్ రోల్స్ అయితే ఎన్నో? 'పెళ్లి చూపులు'లో ఫుడ్ ట్రక్ షెఫ్ రోల్ చేసిన విజయ్... 'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత అటువంటి రోల్ చేయలేకపోతున్నాడు. అందువల్ల, తెలుగు హీరోపై విమర్శలు. 
 మన మట్టి కథల్లో హీరోయిజాన్ని వెలికి తీసినప్పుడు... హీరోలు మనలో ఒకడిగా నటిస్తూ మెప్పించినప్పుడు... విమర్శలు మరుగునపడి ప్రశంసలు వస్తాయి. కానీ, తెలుగులో 'బాహుబలి' కంటే ముందే తమిళంలో శంకర్ చాలా పెద్ద సినిమాలు తీసిన విషయం మరవకూడదు. అలాగే, నిర్మాతగా ఆయన చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. తమిళంలో అన్ని తరహా సినిమాలు వస్తున్నాయి. సూర్య, ధనుష్ లాంటి వాళ్లు పెద్ద సినిమాలు చేస్తూ... కథలు దొరికినప్పుడు ఒరిజినాలిటీ కూడా చూపుతున్నారు. సూర్య చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగులో అది లేదన్నదే బాధ. అందుకే కొంత మంది జనాల నోట సెటైర్లు.

- సత్య పులగం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 05:12 PM (IST) Tags: Venkatesh pawan kalyan narappa dhanush Vakeel Saab Jai Bhim Suriya Sivakumar Yearender 2021 Year Ender 2021 Year End 2021 Tollywood2021 Tollywood2021 Review ABPDesamSpecialStory Asuran

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు