Sunny Deol: సన్నీ డియోల్‌కు షాకిచ్చిన బ్యాంక్, రూ.56 కోట్ల లోన్ కోసం ఆయన బంగ్లా వేలం - ఇంతలోనే ఊహించని ట్విస్ట్
సన్నీ డియోల్ దగ్గర నుంచి రూ.56 కోట్లను రికవర్ చేయడానికి తన బంగ్లాను ఆక్షన్‌లో పెడుతున్నట్టుగా తాజాగా ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ బరోడా.
సినీ సెలబ్రిటీలకు ఏం కరువు.. వారి దగ్గర ఫేం, డబ్బులు అన్నీ ఉంటాయని అనుకుంటాం. అన్నీ ఉన్నా కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని పలు విధాలుగా నష్టపోయినవారు. పైగా ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వారు ఎంత దూరం అయినా వెళ్లవలసి ఉంటుంది. బాలీవుడ్‌లో యాక్టర్‌గా మాత్రమే కాకుండా బీజేపీ ఎంపీగా కూడా రాజకీయాల్లోకి వచ్చాడు సన్నీ డియోల్. ఇటీవల ముంబయిలోని జుహూలో ఉన్న సన్నీ డియోల్ బంగ్లాను బ్యాంక్ ఆఫ్ బరోడా వేలంపాటలో పెట్టింది. కానీ ఎందుకో ఆ వేలం ఛార్జీలను మళ్లీ బ్యాంకే స్వయంగా వెనక్కి తీసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు కొందరు ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రూ.56 కోట్లు బాకీ..
సన్నీ డియోల్ దగ్గర నుంచి రూ.56 కోట్లను రికవర్ చేయడానికి తన బంగ్లాను ఆక్షన్‌లో పెడుతున్నట్టుగా తాజాగా ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. అలా ప్రకటించి 24 గంటలు గడవక ముందే మళ్లీ తన ఆక్షన్ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపింది. 2022 డిసెంబర్ నుంచి సన్నీ డియోల్.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.55.99 కోట్ల బాకీ ఉన్నాడు. దానికోసమే ఈ వేలం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 25న వేలం కూడా వేస్తానని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తన నిర్ణయం మార్చుకోవడం కోసం బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల మిస్టర్ అజయ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్ బంగ్లాను ఈ ఆక్షన్‌లో పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నాం అంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
తండ్రి గ్యారెంటీ ఇచ్చాడు..
సన్నీ డియోల్‌కు సన్నీ విల్లా అనే పేరుతో జుహూలో ఒక బంగ్లా ఉంది. ఇది కనీసం రూ.51.43 కోట్ల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని బ్యాంక్ భావించింది. అంతే కాకుండా రూ.5.14 కోట్ల నుంచి వేలాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించింది కూడా. విల్లాతో పాటు సన్నీ డియోల్‌కు 599.44 చదరపు మీటర్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఒకవేళ బంగ్లా వేలంలో వారికి సరిపడా డబ్బు రాకపోతే.. దీనిని కూడా ఆక్షన్‌లో పెట్టాలని బ్యాంక్ అనుకుంది. సన్నీ డియోల్‌కు సన్నీ సౌండ్స్ అనే ఒక కంపెనీ ఉంది. అతడు తీసుకున్న లోన్‌కు సన్నీ సౌండ్స్ అనే కంపెనీనే గ్యారెంటీ అందించింది. దీంతో పాటు సన్నీ తండ్రి ధర్మేంద్ర పర్సనల్ గ్యారెంటీదారుడిగా కూడా లోన్ పత్రంపై సంతకం పెట్టినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతల విమర్శలు..
సర్ఫేసి యాక్ట్ 2022 ప్రకారం సన్నీ డియోల్ తన ప్రాపర్టీలను కాపాడుకోవాలని అనుకుంటే అతి త్వరలోనే లోన్ అమౌంట్‌ను క్లియర్ చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఉన్నట్టుండి సాంకేతిక లోపాలు అంటూ వేలంపాటను క్యాన్సెల్ చేసింది. దీంతో కాంగ్రెస్ నాయకులు విమర్శలకు దిగారు. ఆంక్షన్‌లో సాంకేతిక లోపాలు అనే అంశం నమ్మే విధంగానే ఉంది అంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ తీసుకున్న లోన్‌ను క్లియర్ చేయడానికి తన ఇల్లును వేలం వేస్తానని చెప్పింది. ఇక 24 గంటలు తిరగక ముందే సాంకేతిక కారణాల వల్ల వేలం కుదరదని చెప్తుంది. ఇది ఎలా నమ్మాలి అంటూ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఇక ఎంపీగా మారినందుకు సన్నీ డియోల్‌కు ఇలాంటి లాభాలు జరుగుతున్నాయని ప్రేక్షకులు కూడా విమర్శించడం మొదలుపెట్టారు.
Also Read: నిర్మాతలకు చెమటలు పట్టిస్తోన్న ‘ది నన్’ నటి బోనీ ఆరోన్స్ - ఏకంగా కోర్టులో దావా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial