Re-Release Trend : చిన్న సినిమాలకు శాపంగా మారుతున్న రీ రిలీజులు?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-రిలీజుల ట్రెండ్ కొనసాగుతోంది, అయితే దీని కారణంగా చిన్న సినిమాలు ఇబ్బంది పడుతున్నాయని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజుల పర్వం నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులను పురస్కరించుకొని లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లో పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలలే కాదు, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. వాటికి కలెక్షన్స్ బాగా వస్తుండంతో, అందరూ ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు క్రాస్ రోడ్స్ కే పరిమితమైన రీ-రిలీజులు.. ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాలు దాటి ఓవర్ సీస్ దాకా వెళ్లిపోయాయి. అయితే ఈ ట్రెండ్ వల్ల చిన్న చిత్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. రీ-రిలీజుల చుట్టూ నెలకొన్న హైప్ కారణంగా స్మాల్ బడ్జెట్ సినిమాలు నష్టపోతున్నాయనే వాదన వినిపిస్తోంది.
నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా చిన్న సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయడం అనేది కష్ట సాధ్యంగానే ఉంటుంది. ఫెస్టివల్స్, సమ్మర్ లాంటి సీజన్స్ లో పెద్ద సినిమాలను విడుదల చేస్తారు కాబట్టి, అవి లేని ఏదొక స్లాట్ చూసుకొని చిన్న సినిమాలను రిలీజ్ ప్లాన్ చేసుకుంటుంటారు. అలా అయితేనే అన్నో ఇన్నో థియేటర్లు దొరుకుతాయి. మౌత్ టాక్ బాగుండే ఆ వారం థియేటర్లలో ఆడతాయి.. లేదంటే వారాంతంలోనే వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు రీ రిలీజుల వల్ల చిన్న మీడియం రేంజ్ సినిమాలకు వీకెండ్ లోనే గట్టి పోటీ ఎదురవుతోంది. థియేటర్లు తక్కువ సంఖ్యలో దొరకడమే కాదు, వాటి హైప్ కారణంగా ప్రేక్షకులు ఈ చిన్నా చితకా సినిమాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మంచి కంటెంట్ తో తీసిన మూవీస్ కూడా ప్రేక్షకాదరణకు నోచుకోవడం లేదని తెలుస్తోంది.
Read Also: 'మన్మథుడు' మళ్ళీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?
నిన్న శుక్రవారం (ఆగస్టు 18) విడుదలైన సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే, బిగ్ బాస్ ఫేమ్ సొహైల్, రూపా కొడువయూర్ జంటగా నటించిన 'మిస్టర్ ప్రెగ్నెంట్' థియేటర్లలో రిలీజ్ అయింది. అలానే సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమ్ కుమార్’.. కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో శివానీ రాజశేఖర్ నటించిన ‘జిలేబి’ వంటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటికి పోటీగా 'యోగి' 'రఘువరన్ బీటెక్' చిత్రాలను రీ-రిలీజ్ చేసారు. ప్రభాస్ - ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల హైప్ కు తగ్గట్టుగానే ఓపెనింగ్ డే కలెక్షన్స్ వచ్చాయి. 'రఘువరన్ బీటెక్' లాంటి డబ్బింగ్ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అదే సమయంలో టీజర్లు ట్రైలర్స్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోవడం గమనార్హం.
ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలు మనుగడ సాగించడం కష్టం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అందుకే శుక్ర, శని, ఆదివారాలు వదిలేసి.. వీక్ డేస్ అయిన సోమ, మంగళ, బుధ వారాల్లో రీ-రిలీజులు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 'మిస్టర్ ప్రెగ్నెంట్' హీరో సోహైల్ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రీ-రిలీజులకి హైప్ ఇచ్చి చిన్న సినిమాలని చంపేయకండని ఆవేదన వ్యక్తం చేశాడు.
రీ-రిలీజులకి హైప్ ఇచ్చి చిన్న సినిమాలని చంపేయకండి...
''వీకెండ్ లో పెద్ద సినిమాలు లేకపోతే జనాలు ఈ చిన్న చిత్రాలకు వస్తారని రిలీజ్ చేస్తాం. అలాంటి టైములో రీరిలీజులు ప్లాన్ చేసి ఎక్కువ హైప్ ఇవ్వడం వల్ల చిన్న సినిమాలు కనపడకుండాపోయే పరిస్థితి వస్తోంది. దయచేసి రీరిలీజులు వీక్ డేస్ లో చేసుకోండి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. కానీ ఆ కంటెంట్ వారికి రీచ్ అవ్వడానికి మాకు 2 - 3 రోజులు పడుతుంది. కానీ అప్పటికే రీరిలీజుల కోసం డబ్బులు ఖర్చు చేసిన ఆడియన్స్, ఆ వారంలో మళ్ళీ థియేటర్ కు వెళ్లలేకపోవచ్చు. నేను అడుక్కుంటున్నాను. ప్లీజ్.. రీరిలీజులను వీకెండ్ లో వెయ్యకండి. చిన్న సినిమాలను ఆదరించండి'' అని సోహైల్ విన్నవించుకున్నారు.
అయితే రీ రిలీజులకు ఇప్పుడప్పుడే బ్రేక్స్ పడేలా కనిపించడం లేదు. రానున్న రోజుల్లో 'మన్మథుడు' 'గుడుంబా శంకర్' '7/G బృందావన కాలనీ' సినిమాలు మళ్ళీ విడుదల అవుతున్నాయి. ఇదే క్రమంలో 'ఏమాయ చేసావే', 'టక్కరి దొంగ', 'కొత్త బంగారు లోకం' తో పాటుగా 'రంగం' లాంటి డబ్బింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి వీటిని చిన్న సినిమాలకు పోటీగా రిలీజ్ చేయకుండా, వీక్ డేస్ లో థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి.
Also Read: బాలయ్య vs రవితేజ - ఇద్దరిలో ఈసారి పైచేయి సాధించేదెవరు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial