Manmadhudu Re Release : మన్మథుడి బర్త్‌డేకి బహుమతి - మళ్ళీ థియేటర్లలోకి కల్ట్ క్లాసిక్ మూవీ
అక్కినేని నాగార్జున హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. గతంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలను.. కల్ట్ క్లాసిక్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. హీరోల బర్త్ డే స్పెషల్ గా లేదా మరేదైనా స్పెషల్ డే సందర్భంగా సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో మళ్ళీ విడుదలైన అనేక చిత్రాలు ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'మన్మథుడు' (4K) మూవీ (Manmadhudu Movie)ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మన్మథుడు'. 'హి హేట్స్ విమెన్' అనేది దీనికి ట్యాగ్ లైన్. కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ - మాటలు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. 2002 డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఈ చిత్రాన్ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2023 ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆగస్టు 29 అనేది అక్కినేని అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే అది నాగార్జున పుట్టినరోజు. ఈ బర్త్ డేని మరింత ప్రత్యేకంగా మార్చడానికి, అన్నపూర్ణ స్టూడియోస్ వారు 'మన్మథుడు' సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'మళ్ళీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోడానికి కింగ్ వస్తున్నాడు' అని పేర్కొన్నారు.
Also Read: 'ప్రభాస్ ఓ మెగాస్టార్' అంటూనే వార్ డిక్లేర్ చేసిన 'వ్యాక్సిన్ వార్' డైరెక్టర్!
నాగార్జున కెరీర్ లో క్లాసిక్ మూవీ 'మన్మథుడు'. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలలో ప్రసారమైనా మంచి టీఆర్పీ రాబడుతుంది. ఇందులో ఓవైపు మన్మథుడిగా మరోవైపు స్త్రీ ద్వేషిగా నాగ్ అద్భుతమైన నటన కనబరిచారు. కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అందులోనూ ఈ మధ్య కాలంలో నాగార్జున సోలో సినిమాలు ఆశించిన స్థాయిలో పెరఫార్మ్ చేయలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ఆయన సూపర్ హిట్ మూవీని మళ్ళీ విడుదల చేయడం మంచి నిర్ణయమని భావిస్తున్నారు.
'మన్మథుడు' మూవీలో నాగార్జున సరసన సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, బాలయ్య, సుధ, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రంగనాథ్, తనీష్, జయప్రకాశ్ రెడ్డి, అనంత్ బాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆరు చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించడమే కాదు, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సమీర్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నిర్వహించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసారు.
బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల షేర్ వసూలు చేసిన 'మన్మథుడు'.. 2002 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా చోటు సంపాదించింది. ఈ చిత్రాన్ని బెంగాలీలో ‘ప్రియోతొమ’ గా రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది. అలానే ఉపేంద్ర కన్నడలో ‘ఐశ్వర్య’ పేరుతో రీమేక్ చేశారు. దీపికా పదుకొణే ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ‘మన్మథుడు’ సినిమాకి సీక్వెల్ గా 2019లో నాగార్జున తెరకెక్కించిన ‘మన్మథుడు-2’ చిత్రం పరాజయ పాలైంది.
Also Read: ధోనీ తెరంగేట్రానికి రంగం సిద్ధమైందా?.. ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial