MS Dhoni: ధోనీ తెరంగేట్రానికి రంగం సిద్ధమైందా?.. ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే నిర్మాతగా మారిన స్టార్ క్రికెటర్.. త్వరలో ఓ సినిమాలో విలన్ గా నటించనున్నారని అంటున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సారధ్యంలో ఇండియాకు రెండో క్రికెట్ వరల్డ్ కప్ ను సాధించిన ఆయన.. క్రీడాభిమానులకు 'తలా' గా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నారు. స్టార్ క్రికెటర్‌గా కొన్నేళ్లపాటు క్రీడా లోకాన్ని ఓ ఊపు ఊపిన ధోనీ.. ఇటీవలే నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసారు. ఈ క్రమంలో త్వరలో యాక్టర్ గా డెబ్యూ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనిని తమిళనాడు ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. ఆ మధ్య ఓ యాడ్ షూట్ కోసం హీరో విజయ్ - ధోనీ కలవడంతో, క్రికెట్ దిగ్గజం సినిమాల్లోకి రానున్నారని వార్తలు వచ్చాయి. ముందుగా నెల్సన్ దర్శకత్వం వహించిన 'బీస్ట్' మూవీలో కీలక పాత్ర పోషించనున్నారని.. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'లియో' లో నటిస్తారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందులో నిజం లేదని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు లేటెస్టుగా తలపతి విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ధోనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
'లియో' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ లో Thalapathy68 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీలోనే ధోనీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అది కూడా ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర అని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్, ధోనీలు కలిసున్న ఫొటోని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
దక్షిణాది సినిమాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్న ధోని.. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. తన సతీమణి సాక్షి సింగ్ తో కలిసి 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్' అనే బ్యానర్ స్థాపించి, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఇందులో తొలి ప్రయత్నంగా ఎల్‌జీఎం (LGM) అనే చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. ఆ సినిమాలోనే ధోనీ డెబ్యూ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా విడుదలయ్యాక అవ్వన్నీ రూమర్సేనని తెలిసిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ Thalapathy68 చిత్రంతో ధోనీ వెండితెర మీద మెరవబోతున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అయితే విజయ్ సినిమాలో ధోనీ నటిస్తున్నారనే వార్త వైరల్ కావడంతో, తలపతి ఫ్యాన్స్ తో పాటు క్రీడాభిమానులు కూడా తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లూ బ్యాట్ తో మైదానంలో మెరుపులు మెరిపించి ఎమ్మెస్.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ధోనీకి బ్రాండ్స్ కు సంబంధించిన పలు యాడ్ షూట్స్ లో నటించిన అనుభవం ఉంది. కాబట్టి నటుడిగా సినిమాల్లోనూ కచ్చితంగా అదరగొడతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
Also Read: 'ప్రభాస్ ఓ మెగాస్టార్' అంటూనే వార్ డిక్లేర్ చేసిన 'వ్యాక్సిన్ వార్' డైరెక్టర్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial