Theatres Bandh: రెండు వారాల పాటు తెలంగాణలో థియేటర్లు బంద్ - అసలు కారణం అదేనా?
Single Screen Theatres In Telangana Closed: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు వారాల పాటు థియేటర్లను మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు.

Theaters In Telangana Remains Closed For Two Weeks: చాలారోజులుగా థియేటర్లలో సినిమా సందడి లేదు. కొత్త సినిమాలు ఏవీ విడుదల కాగా.. విడుదల అయినవి ప్రేక్షకులను మెప్పించలేక థియేటర్లు పూర్తిగా డల్ అయిపోయాయి. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు ఆపేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకపోవడంతో, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తుందని థియేటర్ల ఓనర్లు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా థియేటర్లలో ఆక్యుపెన్సీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు వాపోయారు.
సంక్రాంతికే లాస్ట్..
థియేటర్ల అద్దెల విషయంలో కూడా నిర్మాతలు ఆలోచించాలని థియేటర్ల ఓనర్లు అన్నారు. అప్పటివరకు ప్రదర్శనలు నిలిపేస్తున్నట్టు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తేనే మళ్లీ థియేటర్లు తెరవడం సాధ్యమన్నారు. ఇతర భాషా చిత్రాల గురించి పక్కన పెడితే ఒక తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అనుకొని చాలాకాలమే అయ్యింది. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ సందడి మళ్లీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కనిపించలేదు. సంక్రాంతికి ఒకేసారి ఏకంగా 4 స్టార్ల సినిమాలు విడుదల కాగా.. అందులో చాలావరకు అన్నీ హిట్లు సాధించి చాలాకాలం వరకు థియేటర్లు ఆక్యుపెన్సీతో నడిచేలా చేశాయి. సంక్రాంతి విడుదలయిన ‘హనుమాన్’ అయితే దాదాపు రెండు నెలల పాటు థియేటర్లలో కొనసాగింది. ఆ తర్వాత ఆ రేంజ్ తెలుగు సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల అవ్వలేదు.
మలయాళ సినిమాలే కాపాడాయి..
ఫిబ్రవరీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మలయాళ సినిమాల హవే కొనసాగింది. ‘ప్రేమలు’తో మొదలుపెడితే.. ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ది గోట్ లైఫ్’ వంటి మలయాళ చిత్రాలే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీని పెంచాయి. ముందుగా ఇవి నేరుగా మలయాళంలో విడుదలయ్యాయి. సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేయవచ్చు అనుకున్న ప్రేక్షకులు.. వీటిని నేరుగా మలయాళంలో చూడడానికి థియేటర్లకు వెళ్లారు. మార్చి వచ్చేసరికి ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తెలుగులోనే ఈ చిత్రాలను నేరుగా చూడాలని చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. అలా ఫిబ్రవరీ, మార్చి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ఆక్యుపెన్సీని పెంచాయి మలయాళం సినిమాలు.
ఐపీఎల్ ఎఫెక్ట్..
మే మొదటి వారంలో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయినా కూడా ఇది సమ్మర్ ప్లస్ ఐపీఎల్ సీజన్ కావడంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. రోజంతా ఎండల భయానికి ఇళ్ల నుండి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. సాయంత్రం అయితే ఐపీఎల్ చూస్తూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలా పలు కారణాల వల్ల గత రెండు నెలలుగా థియేటర్లకు నష్టం జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు పలు రీ రిలీజ్ సినిమాల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు వచ్చినా.. అదంతా ఒక్కరోజుకే పరిమితమవుతుంది. దీంతో నష్టం చవిచూడలేక సింగిల్ స్క్రీన్ ఓనర్లు.. ఏకంగా రెండు వారాల పాటు థియేటర్లను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: ఈ 'రంగమ్మత్త' రూటే సపరేట్ - విమర్శలకు, వివాదాలకు తగ్గని హట్ యాంకర్, సోషల్ మీడియా సెన్సేషన్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

