Salman Khan: 'మా మూవీస్ సౌత్ ఆడియన్స్ చూడరు' - అభిమానం తమ సినిమాలపై ఉండట్లేదన్న సల్మాన్ ఖాన్.. నెట్టింట విమర్శలు
Salman Khan On South Audience: దక్షిణాది ఆడియన్స్ తమపై చూపించిన అభిమానం తమ సినిమాపై చూపించరని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Salman Khan About South Audience And South Stars: సౌత్ ఆడియన్స్ తమపై చూపించిన అభిమానం తమ సినిమాలపై చూపించడం లేదని బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు హిందీ సినిమాలు వీక్షించేందుకు అంతగా ఆసక్తి చూపరని అన్నారు.
అభిమానం ఉంది.. కానీ..
తాను రోడ్లపై కనిపిస్తే సౌత్ ఆడియన్స్ తనను 'భాయ్.. భాయ్..' అంటూ ప్రేమ చూపిస్తారని.. అయితే ఆ అభిమానం థియేటర్లలో ఉండదని సల్మాన్ అన్నారు. 'సౌత్ స్టార్స్ చిరంజీవి, రజినీకాంత్, సూర్య, రామ్ చరణ్‌ల చిత్రాలు బాలీవుడ్‌లో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఎందుకంటే మేము థియేటర్‌కు వెళ్లి వారి సినిమాలు చూస్తుంటాం. అయితే, దక్షిణాది ప్రేక్షకులు మాత్రం బాలీవుడ్ సినిమాలు, అందులోని స్టార్లను థియేటర్లలో చూసేందుకు అంతగా ఇష్టపడరు. సౌత్ ఆడియన్స్ మాపై చూపిస్తోన్న ప్రేమను థియేటర్ వరకూ తీసుకెళ్లరు.' అని అన్నారు.
నెటిజన్ల విమర్శలు
సల్మాన్ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా సౌత్ ఆడియన్స్ విమర్శలు చేస్తున్నారు. తాము చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, త్రీ ఇడియట్స్, బజరంగీ భాయ్‌జాన్, ధూమ్, ధూమ్ 2 సినిమాలు ఇక్కడ హిట్ అయ్యాయా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కథలో కొత్తదనం అవసరం
ప్రేక్షకుడి అభిరుచికి తగిన చిత్రాల్ని తీయాలంటే కచ్చితంగా కథలో కొత్తదనం అవసరమని.. దాన్ని ఎవరూ గుర్తించడం లేదని సల్మాన్ అన్నారు. 'ఇటీవల హిందీ చిత్రాలు అంతగా ఆడట్లేదు. సరైన మూవీస్ తీయకపోతే అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడతాయి. ఓ మూవీ వసూళ్లు బాగా వచ్చాయంటే ఆ సినిమా హిట్ అని అర్థం. దక్షిణాదిలో కూడా వారంలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో కనీసం రెండు మూడు చిత్రాలు చేదు ఫలితాలు అందుకుంటున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు తీస్తే అవి కచ్చితంగా సక్సెస్ అవుతాయి.' అని తెలిపారు.
'అది కరెక్ట్ కాదు'
దర్శక నిర్మాతలు పోటీ మీదనే దృష్టి సారిస్తున్నారని.. సినిమా అంటే ఇలా చేయాలని ప్రదర్శించడం కోసమే వారు సినిమాలు తీస్తున్నారని సల్మాన్ చెప్పారు. 'ఇది కరెక్ట్ కాదు. మనం ప్రేక్షకుల కోసం వారికి వినోదాన్ని పంచేందుకు సినిమాలు తీయాలి. ఓటీటీ రాకతో ఆడియన్స్‌కు సినిమా గురించి అన్నీ విషయాలు సులభంగా తెలుస్తున్నాయి. మన వద్ద మంచి కంటెంట్ ఉన్నప్పుడే గొప్ప చిత్రాలు తెరకెక్కించాలి.' అని అన్నారు.
పక్కటెముకకు గాయంతోనే..
తాను పక్కటెముకకు గాయంతోనే 'సికిందర్' (Sikindar) మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సల్మాన్ తెలిపారు. షూటింగ్ సమయంలో తనకు గాయం తగిలిందని.. అలానే చిత్రీకరణలో పాల్గొన్నానని చెప్పారు. ఆ టైంలో కూర్చోవడం, నిలబడడం కూడా కష్టంగా ఉండేదని.. కనీసం నవ్వడం, దగ్గడం కూడా చేయలేకపోయానని అన్నారు. ఈ గాయంతోనే ఓ సాంగ్ షూటింగ్‌లో సైతం పాల్గొన్నట్లు చెప్పారు.
స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన 'సికిందర్' మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఆయన సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మూవీని భారీ బడ్జెట్‌తో సాజిద్ నదియావాలా నిర్మించారు.





















