Sai Dharam Tej: మానని గాయం, సాయి తేజ్‌ను వెంటాడుతోన్న ఆ ప్రమాదం - మరో సర్జరీకి ఏర్పాట్లు?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. త్వరలో ఓ సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, కొద్ది నెలల చికిత్స తర్వాత కోలుకున్నారు. యాక్సిడెంట్ అనంతరం ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్, బాక్సాపీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సర్జరీ కోసం 6 నెలల విరామం
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేస్తున్నా, ఆయనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించడం లేదు. సరిగా డ్యాన్స్ వేయలేకపోతున్నారు. మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయనకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లడంతో దాని నుంచి బయటపడేందుకు డాక్టర్లు పవర్ ఫుల్ స్టెరాయిడ్స్ ఇచ్చినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఆ తర్వాత స్టెరాయిడ్స్ ఇవ్వడం మానేయడంతో బరువు పెరిగినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ కు సంబంధించి సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలిసింది. ఈ సర్జరీ నుంచి కోలుకునేందుకు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది.
విరామం తర్వాత సంపత్ నందితో సినిమా!
6 నెలల విరామం అనంతరం సంపత్ నందితో సినిమా చేయనున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఈ సినిమా వరకు నూటికి నూరు శాతం ఫిట్ నెస్ సాధిస్తానని ఆయన వెల్లడించారు. ఆ సినిమాలో కొత్త సాయి ధరమ్ తేజ్ ను చూసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 2021లో రోడ్డు ప్రమాదం
సెప్టెంబర్ 2021లో జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబరు 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైంది. రోడ్డు మీద ఇసుక ఉండటంతో జారి పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఏకంగా కోమాలోకి వెళ్లిపోయారు. అపోలో హాస్పిటల్ లో కొంత కాలం చికిత్స తీసుకున్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆయనకు మాటలు సరిగా రాలేదు. కొద్ది రోజుల తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు. ఆ రోజు హెల్మెట్ లేకపోతే తాను చనిపోయే వాడినని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. అందుకే, బైక్ మీద వెళ్లే వాళ్లు కచ్చితంగా హెల్మెట్ వాడాలని చెప్పారు.
Read Also: సమంత, రష్మిక అవుట్ - టాలీవుడ్ టాప్ ప్లేస్ కోసం ఆ యంగ్ బ్యూటీస్ పోటీ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial