Posani Krishna Murali Vs Rajinikanth : తెలుగులో ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి - రజనీపై పోసాని సెటైర్లు
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజనీకాంత్, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చేస్తున్నారు. తాజాగా రజనీపై పోసాని విమర్శలు కురిపించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రశంసించడం, హైదరాబాద్ అభివృద్ధిపై ఆయన పొగడ్తల వర్షం కురిపించడం ప్రస్తుతం ఏపీలోని అధికార వైసీపీ నేతలకు నచ్చలేదు. దాంతో తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు ప్రముఖ నటుడు, దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) చేరారు.
రజనీకాంత్ మాటలతో మాకు నష్టం లేదు!
Posani Krishna Murali fires on Rajinikanth : ''రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు నాయుడును పొగిడారు. ఎన్టీ రామారావును పొడిగారు. తప్పు ఏమీ లేదు. రజనీ గారు చంద్రబాబును ఎన్నిసార్లు పొడిగినా తప్పు లేదు. మాకు ఇసుమంతైనా నష్టం లేదు. మద్రాసు నుంచి ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ వచ్చి, విజయవాడ సెంటరులో ఆయన మాట్లాడవచ్చు. దాని వల్ల మాకు నష్టం లేదు'' అని పోసాని కృష్ణమురళి తాజాగా వ్యాఖ్యానించారు.
తెలుగులో ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి
తెలుగులో రజనీకాంత్ కంటే చిరంజీవి పెద్ద సూపర్ స్టార్ అని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకు ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి. ఇండియాలోని టాప్ స్టార్లలో ఆయన ఒకరు. తెలుగులో ఏకైక టాప్ స్టార్ చిరంజీవి గారు. ఆయన మాట్లాడితే విలువ ఉంటుంది'' అని పేర్కొన్నారు.
చిరంజీవి గారు ఏం మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు వింటారని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వింటారని స్పష్టం చేశారు.
ఏపీలో చిరుకు విలువ ఉంది...
రజనీకాంత్ విలువ ఎక్కడ ఉంది?
ఆంధ్ర దేశంలో మా సూపర్ స్టార్, మా చిరంజీవికి విలువ ఉందని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడితే ఆలోచించాలని, తమిళనాట రజనీకాంత్ సూపర్ స్టార్ అని, ఆయన అక్కడ మాట్లాడితే విలువ ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. వైసీపీని విమర్శించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, తమకు చిరంజీవి మాటలే లెక్క అని పేర్కొన్నారు.
తండ్రిని ప్రేమించినట్టు చిరును జగన్ ప్రేమిస్తారు!
మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఇష్టమని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించడం విశేషం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక విమానంలో వచ్చి మరీ కౌగలించుకుని, ముద్దు పెట్టుకుని ''తమ్ముడూ కంగ్రాట్స్!'' అని శాలువా కప్పి, అభినందించారని తెలిపారు. చిరంజీవి అంటే జగన్ మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేక అభిమానం అన్నారు. చిరు వస్తున్నారని తెలిస్తే సీటు లోంచి లేచి వచ్చి మరీ బయట నిలబడతారని పోసాని చెప్పుకొచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి ఎంతగా ప్రేమిస్తారో... చిరంజీవిని అంతలా ప్రేమిస్తారని పోసాని వివరించారు. అందువల్ల, చిరంజీవి మాటలకు మాత్రమే విలువ ఇస్తామని, మిగతా వాళ్ళు మాట్లాడితే నవ్వుకుంటామని పోసాని వివరించారు.
రజనీకి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ మేరకు ట్వీట్ చేశారు. పోసాని వ్యాఖ్యల నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : ఎన్టీఆర్ 30లో 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ హీరోయిన్ చైత్ర - రోల్ ఏంటంటే?