Rajinikanth Last Movie : రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తలైవర్ చివరి సినిమా గురించి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు 20 ఏళ్ళ క్రితమే ప్రకటించారు. 'బాబా' సినిమా టైంలో ఇదే తనకు చివరి చిత్రమని రజినీ ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి ఆయన నిర్మాతగా వ్యవహరించడమే కాదు, స్క్రీన్ రైటర్ గానూ వర్క్ చేసారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. దీంతో మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న రజినీ, మనసు మార్చుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. 'చంద్రముఖి' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు..వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక అప్పటి నుంచీ తలైవర్ లాస్ట్ మూవీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా మరోసారి రజినీ చివరి సినిమాపై డిస్కషన్ మొదలైంది.
రజినీకాంత్ ప్రస్తుత వయస్సు 72 సంవత్సరాలు. అయినా సరే కుర్ర హీరోలకు పోటీగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. రజనీ ఇప్పుడు తన 169వ సినిమా 'జైలర్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దీనికి దర్శకుడు. మరోవైపు తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న 'లాల్ సలామ్' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత 'డాన్' ఫేమ్ శిబి చక్రవర్తి లేదా టీజె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే అదే రజినీ కెరీర్లో చివరి సినిమా అవుతుందని తమిళ డైరెక్టర్ మిస్కిన్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
'పిశాచి', 'సైకో' చిత్రాల దర్శకుడు మిస్కిన్ ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'లియో' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రజినీ - లోకేష్ కాంబినేషన్ పై స్పందించాడు. తలైవర్ తో లోకేష్ సినిమాని ధ్రువీకరించిన మిస్కిన్.. యువ దర్శకుడి పట్ల తాను చాలా సంతోషంగా గర్వంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు లోకేష్ తో సినిమా చేయడం కోసం రజనీయే ఆసక్తి చూపారని.. సినిమా చేద్దామని స్వయంగా అడిగినట్లుగా చెప్పారు. తనకు వంద శాతం కచ్చితంగా తెలియనప్పటికీ, అది రజినీ కాంత్ కు చివరి సినిమా అని విన్నట్లుగా మిస్కిన్ తెలిపారు.
Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
డైరెక్టర్ మిస్కిన్ కామెంట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో కోలీవుడ్ సూపర్ స్టార్ లాస్ట్ మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. 50 దశాబ్దాల సినీ కెరీర్ కు రజినీ తన 171వ సినిమాతో గుడ్ బై చెబుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది తలైవా చివరి సినిమా అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, రజనీ - లోకేష్ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన లోకేశ్ కనగరాజ్.. ఈసారి రజినీకాంత్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తారని ఫిక్స్ అయ్యారు. లోకేష్ యూనివర్స్ లో ఆయన్ని భాగం చేస్తారని భావిస్తున్నారు. మరి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Read Also: జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై RRR హీరోలు - తారక్ & చరణ్ పిక్ వైరల్!