Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో 'నిమ్మకూరు మాస్టారు'... హీరోగా సంగీత దర్శకుడి వారసుడు!
Nimmakuru Mastaru: నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో 'నిమ్మకూరు మాస్టారు' ప్రారంభమైంది. ఈ సినిమాతో సీనియర్ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మనవడు హీరోగా పరిచయం అవుతున్నారు.
నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) టైటిల్ పాత్రధారిగా కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ సినిమా పేరు 'నిమ్మకూరు మాస్టారు' (Nimmakuru Mastaru Movie). అముదేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. జెఎమ్ సినీ ఫ్యాక్టరీ పతాకంపై జెఎమ్ ప్రదీప్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్నారు. పాటలు అన్నిటికీ ప్రముఖ కవి, గేయ రచయిత జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ మంత్రి క్లాప్!
హైదరాబాద్ సిటీలోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'నిమ్మకూరు మస్తారు' ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. హీరో శ్యామ్ సెల్వన్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ ఇవ్వడంతో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: మీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!
మాధవపెద్ది కుటుంబంలో ఐదవ తరం వారసుడు
మాధవపెద్ది కుటుంబం నుంచి ఐదవ తరానికి చెందిన తన మనవడు శ్యామ్ సెల్వన్ కథానాయకుడిగా పరిచయం అవుతుండడం తనకు ఎంతో గర్వ కారణంగా ఉందని మాధవపెద్ది సురేష్ చంద్ర తెలిపారు. 'నిమ్మకూరు మాస్టారు' చిత్రానికి జాతీయ స్థాయిలో పురస్కారాలు రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదొక సంగీత ప్రాధాన్య చిత్రమని జొన్నవిత్తుల తెలిపారు. 'నిమ్మకూరు మాస్టారు'లో పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ఓ పాట అయితే ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మాధవపెద్ది సురేష్ చంద్ర ఇప్పటి వరకు చేసిన సినిమాలు, వాటిలో పాటలు ఒక ఎత్తు అయితే... మనవడి పరిచయ చిత్రంలో పాటలు మరొక ఎత్తు అని ఆయన జొన్నవిత్తుల తెలిపారు.
నటకిరీటితో సినిమా అవకాశం ఎంతో సంతోషం!
హీరో శ్యామ్ సెల్వన్ మాట్లాడుతూ... ''రాజేంద్ర ప్రసాద్ వంటి లెజెండరీ నటుడితో నాకు సినిమా చేసే అవకాశం రావడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఎంతో సంతోషంగానూ, ఉద్వేగంగా ఉంది'' అని చెప్పారు. మాధవపెద్ది సురేష్ చంద్ర, జొన్నవిత్తుల, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజాలతో 'నిమ్మకూరు మాస్టారు' సినిమా చేసే అవకాశం లభించడం తన అదృష్టమని నిర్మాత జెఎమ్ ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తానని చెప్పారు. తమిళంలో శివాజీ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రభు, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రానికి దర్శకత్వం వహించానని, తెలుగు చిత్రసీమకు నిమ్మకూరు మాస్టారు' పరిచయం అవుతుండటం గర్వంగా ఉందని అముదేశ్వర్ అన్నారు.
Also Read: అమలా పాల్ ఇంట వారసుడొచ్చాడు... వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్, పిల్లాడి పేరు ఏమిటంటే?
'నిమ్మకూరు మాస్టారు' చిత్రానికి ఛాయాగ్రహణం: ఎడి కరుణ్, కళా దర్శకత్వం: మురళి, కూర్పు: ఎఆర్ శివరాజ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రమోహన్, సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం: మాధవపెద్ది సురేష్ చంద్ర, నిర్మాణం: జెఎమ్ ప్రదీప్, కథ - కథనం - దర్శకత్వం: అముదేశ్వర్.