Rajamouli - Mahabharatham : రాజమౌళి 'మహాభారతం', చదవడానికి ఏడాది - పది భాగాలుగా!
మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి గతంలో చెప్పారు. లేటెస్టుగా మరో కార్యక్రమంలో దాని గురించి మాట్లాడారు. మొత్తం పది భాగాలుగా తీయాల్సి వస్తుందేమోనని ఆయన చెప్పుకొచ్చారు.
'బాహుబలి'తో రాజమౌళి రేంజ్ మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఆయన వెళ్ళారు. ఇండియాలో, ఆ మాటకు వస్తే విదేశాల్లో 'బాహుబలి' ఏ స్థాయి విజయం సాధించిందనేది అందరికీ తెలుసు. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు తీసిన సినిమా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'. దాంతో ఏకంగా ఆస్కార్ అవార్డును తెలుగుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేయబోయే, చేయాలని అనుకునే సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంటుంది. అందుకని, మరోసారి మహాభారతం ప్రస్తావన రాజమౌళి ముందుకు వచ్చింది.
రాజమౌళికి మహాభారతం తీయాలని కోరిక. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనని ఆయన గతంలో చెప్పారు. బహుశా... 10, 12 ఏళ్ళ తర్వాత ఆ సినిమా తీస్తానేమోనని ఆయన పేర్కొన్నారు కూడా! లేటెస్టుగా ఓ కార్యక్రమంలో ఆయనకు మరోసారి మహాభారతం గురించి ప్రశ్న ఎదురైంది.
చదవడానికి ఏడాది పడుతుందేమో!?
'మీరు మహాభారతాన్ని తీయాలని అనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు?' అని జక్కన్నకు ప్రశ్న వేశారు. టీవీలో 266 ఎపిసోడ్స్ వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అప్పుడు రాజమౌళి ''నాకూ తెలియదు! ఒకవేళ మహాభారతం తీయాలని అనుకుంటే... భారతదేశంలో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలి. దానికి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు. అప్పటికీ స్క్రిప్ట్ వర్క్, రైటింగ్ స్టార్ట్ చేయలేం. మహాభారతం చాలా పెద్ద ప్రాజెక్ట్! ఒకవేళ తీస్తే పది భాగాలుగా తీయాల్సి వస్తుందేమో! ప్రస్తుతానికి ఇది నా అంచనా మాత్రమే! కచ్చితంగా ఎన్ని భాగాలు చేస్తానో చెప్పలేను'' అని సమాధానం ఇచ్చారు. అదీ సంగతి!
'మహాభారతం' తెరకెక్కించడానికి భారీ నిర్మాణ వ్యయం, అనుభవం అవసరమని రాజమౌళి గతంలో చెప్పారు. ఇప్పుడు ఆయనకు కావాల్సిన అనుభవం ఉంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ఆయన 'అవును' అంటే ఎన్ని కోట్ల రూపాయలు అయినా సరే పెట్టడానికి ముందుకు వచ్చే నిర్మాతలు ఉన్నారు.
హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ వంటి బడా దర్శకులు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి, దర్శక ధీరుడి మనసులో ఏం ఉందో? ఒక్కసారి మొదలు పెడితే... మధ్యలో బ్రేకులు లేకుండా అన్ని భాగాలూ ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారేమో!? ప్రజెంట్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా మీద ఆయన కాన్సంట్రేట్ చేశారు.
Also Read : 'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?
ఆల్రెడీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఆఫిక్రా నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ లైన్ మహేష్ బాబు సినిమా కోసం అనుకుంటున్నామని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
బహుశా... నిధుల వేట దగ్గర నుంచి ఇల్లీగల్ మైనింగ్, ఆర్కియాలజీ రిలేటెడ్ అడ్వెంచరెస్ కాన్సెప్ట్ ఏదైనా అయ్యిండొచ్చు. లియోనార్డో డికాప్రియో 'బ్లడ్ మైండ్' లేదా స్పీల్ బర్గ్ తీసిన 'ఇండియా జోన్స్' లేదా 'గాడ్ ఫాదర్' లాంటి అండర్ వరల్డ్ మాఫియా లైన్‌లో ఉండే సినిమా అయ్యిండొచ్చు. యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ డ్రామా క్రియేట్ చేయాలని రాజమౌళి అనుకుంటే ఈ లైన్ లో ఏదైనా అనుకుని ఉండొచ్చు!?
Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?