Pushpa 2 Deleted Scenes: సినిమాలో ఆ క్రికెట్ మ్యాచ్ సీన్స్ లేవుగా... ‘పుష్ప 2’ డిలీటెడ్ సీన్స్ ఇంకా ఎన్ని దాచేశావ్ సుక్కు!?
లెక్కల మాస్టారు, క్రియేటివ్ జీనియస్ సుక్కుపై కొన్ని విమర్శలు ఉన్నాయి. సినిమాకు కావాల్సిన దానికంటే రెట్టింపు సన్నివేశాలను చిత్రీకరిస్తాడని. తాజాగా వచ్చిన పుష్ప 2 వీడియో సాంగ్ చూస్తే అది నిజమనిపిస్తోంది
క్రియేటివ్ జీనియస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు లెక్కల మాస్టారు, దర్శకుడు సుకుమార్. లెక్కల మాస్టారుగా ఉన్నప్పుడు పిల్లలకు లెక్కలు నేర్పినట్టే.. ఇప్పుడు దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో నేర్పుతున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు.. బ్యాక్‌గ్రౌండ్‌లో స్పెషల్‌గా కొన్ని సన్నివేశాలు వస్తుంటాయి. ఆ సన్నివేశాలలోనే సినిమా మొత్తం ఉంటుంది. అదే ఈ క్రియేటివ్ డైరెక్టర్ క్రియేటివిటీ. మొదటి నుండి సుకుమార్ సినిమాలను గమనిస్తే.. ఆ ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’.. ఇలా ప్రతి సినిమాలోనూ టైటిల్ కార్డ్స్ పడే సమయంలోనే స్టోరీని చెప్పేందుకు ఓ వినూత్న పద్ధతిని సుక్కు ప్లే చేస్తుంటాడు. అది అర్థం చేసుకోగలిగితే.. ఆ సినిమా చూసే తీరే మారిపోయి.. పూర్తిగా సినిమాలో లీనమైపోతారు. అసలు సుకుమార్ అలా ఎలా చెప్పగలిగాడని ఆలోచన కూడా చేస్తారు. అది.. ఈ లెక్కల మాస్టారులో ఉన్న స్పెషాలిటీ. ఇక విషయంలోకి వస్తే...
సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్లు తగ్గేదే లే అన్నట్లుగా రికార్డులకు కారణమవుతున్నాయి. కేవలం రెండంటే రెండే వారాల్లో రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేసిందంటే.. ‘పుష్ప’ ఫైర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘పుష్ప 1’తోనే ప్రపంచాన్ని కదలించిన ఈ కాంబినేషన్.. ‘పుష్ప 2’తో మరోసారి మాకు ఎదురే లేదని నిరూపించుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తయినా.. పుష్పరాజ్ బాక్సాఫీస్ జాతరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అసలీ సినిమాకు పోటీగా రావడానికే మిగతా సినిమాలు భయపడ్డాయి. అది ‘పుష్పరాజ్’ గాడి క్రేజ్. మరి ‘పుష్ప 1, 2’లతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ కాంబో.. ఇప్పుడు పార్ట్ 3 కూడా ఉందనేలా హింట్ ఇచ్చింది. ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడయితే క్లారిటీ లేదు కానీ.. భవిష్యత్‌లో పార్ట్ 3 వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.
Also Read: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
పార్ట్ 3 సంగతి ఏమో గానీ.. ‘పార్ట్ 2’ కోసమే రెండు సినిమాలకు సరిపడా కంటెంట్‌ని సుక్కు రెడీ చేసినట్లుగా.. తాజాగా వచ్చిన ఓ వీడియో తెలియజేస్తుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత డిలీటెడ్ సీన్స్ అంటూ కొన్ని సన్నివేశాలను విడుదల చేస్తుంటారు. ‘పుష్ప ది రైజ్’ విడుదలైన తర్వాత కూడా పుష్ప ఫ్యామిలీకి సంబంధించి ఓ సీన్‌ని విడుదల చేశారు. ఇప్పుడు పుష్ప 2 విడుదల తర్వాత విడుదల చేసిన ‘పుష్ప పుష్ప పుష్పరాజ్’ వీడియో సాంగ్‌లో సినిమాలో లేని సీన్లను ఈ పాటలో ఇరికించారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ సీన్లు ఈ సినిమాలో లేవు.. కానీ ఈ పాటలో చూపించారు.
ఇదేంటి అని చూస్తే.. దాదాపు ఇలాంటివి ఒక గంటకు పైగా సీన్లను ఎడిట్ టేబుల్‌పై పక్కన పెట్టేశారని తెలుస్తోంది. అంతే, ఈ వీడియో విడుదలైనప్పటి నుండి.. పుష్ప డిలీటెడ్ సీన్స్ ఇంకా ఎన్ని దాచేశావ్ సుక్కు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా సుకుమార్ చిత్రీకరణపై వార్తలు బాగానే వినిపించాయి. రీల్ బాగా వాడేస్తాడని, ఒక్క సినిమాకు దాదాపు రెండు సినిమాల అవుట్‌ఫుట్‌ని ఆయన చిత్రీకరిస్తారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని సీన్లను ఇలా వదులుతారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ పాట బాగా వైరల్ అవుతూ.. టాప్ 1లో ట్రెండ్ అవుతోంది.