Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు ఏపీ ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు, అసలేం జరిగింది
Andhra Pradesh Latest News | టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతి, గుర్తింపు రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది.

Mohan Babu University | అమరావతి: నటుడు మోహన్‌బాబుకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీకి ఉన్నత విద్య కమిషన్ షాకిచ్చింది. ఏకంగా యూనివర్సిటీ రద్దు చేయాలని సిఫార్సు చేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు, వారి ఆదాయం వివరాలు వెల్లడించకపోవడం, విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఇటీవల రూ.15 లక్షల జరిమానా విధించగా మోహన్ బాబు యూనివర్సిటీ ఆ మొత్తాన్ని చెల్లించింది.
తిరుపతి (Tirupati) జిల్లాలోని చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది. విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో లోపాలు, సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి విషయాలు ఉన్నత విద్య కమిషన్ దృష్టికి వెళ్లాయి. ఇటీవల విధించిన జరిమానాను వర్సిటీ చెల్లించింది. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 (26.17 కోట్లు) తిరిగి చెల్లించాలని ఉన్నత విద్యా కమిషన్ సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది.

అధిక ఫీజులు తిరిగి చెల్లించాలని నోటీసులు
2022-23 అకడమిక్ ఇయర్ నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు మోహన్‌బాబు వర్సిటీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులు రూ.26.17 కోట్లు అని ఉన్నత విద్యా కమిషన్ పేర్కొంది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సిందిగా వర్సిటీని కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో మోహన్ బాబు వర్సిటీ అనుమతి, గుర్తింపు రద్దు చేయాలని యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీఏహెచ్‌పీ, హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్, ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది.
రంగంపేటలో మోహన్‌బాబు ప్రైవేటు యూనివర్సిటీ
తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీవిద్యానికేతన్ కాలేజీ 2022లో మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. ఈ ఇంజినీరింగ్ కాలేజీలో 70 శాతం సీట్లు, మోహన్ బాబు వర్సిటీ అయ్యాక గ్రీన్‌ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లో 35 శాత సీట్లను ఏపీ ప్రభుత్వం కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తుంది. ఈ కోటా కింద చేరే విద్యార్థులకు ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలి. అయితే యూనివర్సిటీ తమ వద్ద అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు, తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. హాస్టల్‌లో ఉండని వారితో మెస్ ఛార్జీలను వసూలు చేయడం, బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు కట్టించుకున్నారని ఆరోపించారు.
కమిషన్ చర్యలతో హైకోర్టుకు వెళ్లిన యూనివర్సిటీ..
అదనపు ఫీజులు రూ.26 కోట్లు విద్యార్థులకు పదిహేను రోజుల్లో తిరిగి చెల్లించాలని ఉన్నత విద్య కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మోహన్ బాబు యూనివర్సిటీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 26న దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది. వర్సిటీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అదే సమయంలో హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.






















